తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా నాగారం మండలం పస్తాలకు చెందిన చిత్తలూరు శ్రీనివాస్, సురాంభ(35) దంపతులు. 18 ఏళ్ల క్రితం హైదరాబాద్ రామంతాపూర్ వచ్చి శ్రీనగర్ కాలనీలో నివాసముంటున్నారు. మూడేళ్ల క్రితం వరకు శ్రీనివాస్ డ్రైవర్‌గా పని చేసేవాడు. అనంతరం భార్యాభర్తలిద్దరూ కలిసి కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కూతురు(ఇంటర్), కుమారుడు(9వ తరగతి) ఉన్నారు. అయితే.. కొంతకాలంగా శ్రీనివాస్ సక్రమంగా పని చేయకపోగా.. అప్పులు చేస్తున్నాడు. చేసిన అప్పులు తీర్చాలంటూ.. ఇచ్చిన వారు ఇంటికొచ్చి ఒత్తిడి చేస్తున్నారు. ఈ విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి.
ఇంట్లో పిల్లలు నిద్రిస్తున్న వేళ..
ఈ క్రమంలోనే.. భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో.. శ్రీనివాస్ తన భార్యను విచక్షణారహితంగా కొట్టాడు. అపస్మారక స్థితిలో పడిఉన్నసురాంభ చనిపోలేదని గుర్తించి.. కొన ఊపిరితో ఉన్న ఆమె మెడకు ఉరివేసి (Husband brutally Kills his Wife ) చంపేశాడు. ఇంట్లో ఇద్దరు పిల్లలు పడుకున్న తర్వాత అనుమానం రాకుండా చంపాడు. అదే రాత్రి మృతదేహాన్ని తన టాటా ఏసీ ఆటోలో వేసుకొని ఊరికి బయలు దేరాడు. ఆ సమయంలో అర్ధరాత్రి దాటాక పిల్లలకు మేలుకొచ్చి ఫోన్ చేస్తే కూరగాయల కోసం వెళ్తున్నట్లు చెప్పి నమ్మించాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మృతదేహంపైన, చుట్టూ కూరగాయల ఖాళీ డబ్బాలు పెట్టాడు.