Gold stolen from Union Bank: పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలోని యూనియన్ బ్యాంకులో బంగారం మాయమైన ఘటన కలకలం రేపింది. బ్యాంకులో రుణాలు తీసుకునేందుకు వినియోగదారులు తాకట్టు పెట్టిన బంగారాన్ని ఉద్యోగులే మాయం చేశారు. బ్యాంక్ అప్రయిజర్ ఇమ్మిడిశెట్టి సంపత్ కుమార్ ఇందులో కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు చెబుతున్నారు. మొత్తం కోటి 70 లక్షల విలువ చేసే బంగారాన్ని అప్రయిజర్ మాయం చేశారు.
తాము తీసుకున్న రుణం చెల్లించిన తర్వాత కూడా బంగారం ఇవ్వకపోవటంతో బ్యాంకు అధికారుల్ని ఖాతాదారులు నిలదీశారు. బ్యాంకు అధికారుల విచారణలో బంగారం మాయమైనట్లు తేలింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన మేనేజర్ రాంబాబు నాయక్, అసిస్టెంట్ మేనేజర్ రవికుమార్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. బంగారం మాయమవటంపై బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంగారం తీసుకెళ్లిన సంపత్ కుమార్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. అతడిని విచారించిన తర్వాత ఈ వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉందనేది తెలుస్తుందంటున్నారు. బంగారాన్ని రికవరీ చేసిన తర్వాత పోలీసులు అధికారికంగా వివరాలు వెల్లడించనున్నారు.