Rape: తిరుపతిలో దారుణం.. బాలికపై సామూహిక అత్యాచారం - ఏపీ ముఖ్యవార్తలు
14:20 September 01
మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు బాలిక తల్లి ఫిర్యాదు
RAPE ON GIRL : ఊరంతా వినాయక చవితి వేడుకల్లో ఉండగా.. బుధవారం అర్ధరాత్రి కేవీబీ పురం మండలంలో ఓ బాలికపై అత్యాచారం జరిగింది. ముగ్గురు యువకులు దుశ్చర్యకు పాల్పడినట్లు మొదట అనుమానాలు వ్యక్తం కాగా.. ఘటనలో ముగ్గురి ప్రమేయం ఉండగా.. ఒక్కరే అత్యాచారం చేసినట్లు చివరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు ముగ్గురు పరారీలో ఉన్నారు. పోలీసులకు బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. కేవీబీ పురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థిని (14) తన తల్లితో కలిసి గ్రామంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాలను చూసేందుకు వెళ్లింది. బాలికకు కడుపు నొప్పి రావడంతో రాత్రి 10 గంటల సమయంలో కుమార్తెను ఇంట్లో వదిలేసిన తల్లి తిరిగి వెళ్లి రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి వచ్చింది. ఆ సమయంలో కుమార్తె కనిపించకపోవడంతో గ్రామంలో వెతికినా ప్రయోజనం కనిపించలేదు. గురువారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఇంటి ఆవరణలోని స్నానాల గది వద్ద తన కుమార్తె అపస్మాకరస్థితిలో పడి ఉండటాన్ని ఆమె గుర్తించింది. ఏం జరిగిందో ఆరా తీయగా.. తాను స్నానాల గదికి వెళ్లిన సమయంలో నిందితులు సెల్వం, గుణ, అశోక్ తనను అపహరించినట్లు బాధితురాలు తల్లికి వివరించింది. తనను సమీపంలోని శ్మశానవాటికకు తీసుకెళ్లి కర్రతో మోదగా.. తాను కిందపడిపోవడంతో గుణ, అశోక్‌లు అక్కడి నుంచి పరారయ్యారని.. సెల్వం తనపై అత్యాచారం చేసినట్లు బాధితురాలు పేర్కొంది. ఆ తర్వాత అర్ధరాత్రి తిరిగి తన ఇంటి ఆవరణలోనే బాత్‌రూం వద్ద సెల్వం వదిలేసి వెళ్లినట్లు బాధితురాలు తల్లికి తెలియజేసింది. ఈ మేరకు బాధితురాలి తల్లి గురువారం మధ్యాహ్నం 12.35 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. నిందితులపై పోక్సో కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఎందుకీ వ్యత్యాసం..గురువారం సాయంత్రం ఎస్‌ఐ వెల్లడించిన వివరాలకు, ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసిన వివరాలకు వ్యత్యాసం ఉండటంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాలికకు మత్తు ఇచ్చినట్లు పోలీసులు మొదట పేర్కొనగా.. కొట్టడంతోనే అపస్మారకస్థితిలోకి వెళ్లినట్లు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేయడం గమనార్హం. ఈ కేసు వివరాలు చెప్పేందుకు పోలీసులు గోప్యత పాటించడాన్ని బట్టి పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నా రన్న ఆరోపణలున్నాయి. ఉన్నతాధికారులు ఈ ఘటనపై ప్రత్యేకంగా దర్యాప్తు చేయించాలని పలువురు కోరుతున్నారు.
ఇవీ చదవండి: