తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం అయ్యగారిపల్లి వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడటంతో ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో పలువురు గాయాలపాలయ్యారు. దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది.
accident: దుర్గామాత నిమజ్జనంలో విషాదం.. నలుగురి దుర్మరణం - ఖమ్మంలో ట్రాక్టర్ బోల్తా
దుర్గామాత విగ్రహం నిమజ్జనం వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ ఘటన.. బాధిత కుటుంబాలను శోక సంద్రంలో ముంచేసింది.
కమలాపురం నుంచి అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు మున్నేరు నదికి తరలించారు. ఒక ట్రాక్టర్‌లో విగ్రహం ఉండగా.. మరో ట్రాక్టర్‌లో కొంతమంది గ్రామస్థులు, యువకులు ఎక్కారు. విగ్రహం ఉన్న ట్రాక్టర్ మున్నేరు నది వద్దకు వెళ్లింది. వెనుకనున్న మరో ట్రాక్టర్ వల్లభి వైపు వెళ్లింది. ట్రాక్టర్ వేగానికి తోడు వర్షం కురుస్తుండటంతో అయ్యగారిపల్లి వద్ద బోల్తాపడింది. ప్రమాద సమయంలో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.