ఆ అమ్మాయిలిద్దరూ కవలలు. వారి వయసు తొమ్మిదేళ్లే. ఆ చిన్నారులపై కన్నతల్లి ప్రోత్సాహంతోనే తొమ్మిది మంది అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో బాలికలకు సమీప బంధువైన బాలుడితో పాటు మరో ముగ్గురు బాలురూ ఉన్నారు. 2016లో ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులకు కఠిన శిక్షలు విధిస్తూ సైబరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి సోమవారం తీర్పు వెలువరించారు.
నలుగురు నిందితులకు, బాలికల తల్లికీ.. జీవితఖైదు
బాలికలపై అత్యాచారానికి ఒడిగట్టిన నలుగురు నిందితులకు న్యాయస్థానం జీవిత ఖైదుతో పాటు మొదటి నిందితుడికి రూ.35 వేలు, మిగతా ముగ్గురికి రూ.30 వేల చొప్పున జరిమానా విధించింది. వీరితోపాటు నేరంలో భాగస్వాములైనందుకు బాలికల కన్నతల్లికి జీవితఖైదు, రూ.20 వేల జరిమానా విధించింది. ఈ కేసు వివరాలను తెలంగాణలోని రంగారెడ్జి జిల్లా కోర్టుల ఆవరణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంగర రాజిరెడ్డి వెల్లడించారు.
ఆమె అఘాయిత్యం
బాలికల తల్లి(35) మైలార్‌దేవ్‌పల్లి ఠాణా పరిధిలో ఉంటూ.. ఓ ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసేది. 2016లో చాదర్‌ఘాట్‌కు చెందిన సయ్యద్ జాఫర్(45), ఘన్సీబజార్‌కు చెందిన ప్రదీప్ అగర్వాల్(40), రాజేంద్రనగర్‌కు చెందిన సంతోష్‌కుమార్(29), కాటేదాన్‌కు చెందిన రాహుల్ మండల్(25), స్థానికంగా ఉండే ఓ ప్లాస్టిక్ కంపెనీ సూపర్‌వైజర్ ఆమెతో పరిచయం పెంచుకున్నారు. ఆమె ప్రోత్సాహంతో బాలికలపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. వీరితోపాటు బాలికల సమీప బంధువైన బాలుడితో పాటు మరో ముగ్గురు బాలురు అత్యాచారం చేశారు.
నిందితులకు పోక్సో చట్టం కింద శిక్షలు ఖరారు
రంగారెడ్డి జిల్లా శిశు సంక్షేమ కమిటీ సూచనతో జిల్లా పిల్లల సంరక్షణ అధికారి మైలార్‌దేవ్‌పల్లి ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలికల కన్నతల్లితో పాటు నలుగురు నిందితులను రిమాండుకు తరలించారు. మరో నిందితుడు ప్లాస్టిక్ కంపెనీ సూపర్‌వైజర్ పరారీలో ఉన్నాడు. ఐదుగురిపై సమగ్ర ఆధారాలతో కూడిన అభియోగ పత్రాన్ని కోర్టులో దాఖలు చేశారు. కేసును విచారించిన సైబరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి సురేశ్ నిందితులకు పోక్సో చట్టం కింద శిక్షలు ఖరారు చేస్తూ సోమవారం తీర్పునిచ్చారు. నిందితులైన నలుగురు బాలురిపై రంగారెడ్డి జిల్లా జువైనల్ జస్టిస్ బోర్డులో కేసు విచారణ కొనసాగుతోంది.
ఇదీ చూడండి:
అంబులెన్స్‌లో మంటలు.. గ్యాస్ సిలిండర్ పేలుడుతో ప్రమాదం