వాళ్ల మధ్య బంధుత్వం లేదు.. అలాగని శత్రుత్వం లేదు.. ఇంతవరకు ఎప్పుడూ ఒకరినొకరు చూసుకున్నదీ లేదు. కలుసుకున్నది లేదు. తన మిత్రుడిని వెటకారంగా చూశారని.. తేడా గాడివా అనడం వల్ల మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి బీరు సీసాతో దాడి చేసిన ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఘటన గురువారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాంలో జరిగింది. ఈ ఘర్షణకు కారణమైన ఐదుగురిని 30 గంటల్లోనే అదుపులోకి తీసుకున్నామని అందులో ఒకరు మైనర్ ఉన్నాడని యానాం సర్కిల్ ఇన్స్పెక్టర్ శివ గణేష్ తెలిపారు.
'తేడాగాడివా' అన్నందుకు హత్య.. ఐదుగురు అరెస్ట్
తూర్పగోదావరి జిల్లా యానాంలో జరిగిన హత్యకు సంబంధించి పోలీసులు ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అందులో ఓ మైనర్ ఉన్నట్లు తెలిపారు. బాలుడితో హేళనగా మాట్లాడినందుకే దాడి చేసినట్లు నిందితులు చెప్పారని.. హత్య వెనుక గల కారణాలు విచారణలో తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు.
ఇదీ జరిగింది..
తూర్పు గోదావరి జిల్లా రాజవోలుకు చెందిన పట్నాల చిన్న సత్యనారాయణ, పంపన సుబ్బారావు, మణికంఠ మద్యం సేవించిన అనంతరం బిర్యానీ తీసుకునే దగ్గర తన మిత్రుడైన మైనర్ బాలుడిని తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం చెందిన లంక రాజాబాబు హేళనగా మాట్లాడటంతో ఘర్షణ మొదలై చివరకు హత్యకు దారితీసిందని పోలీసులు తెలిపారు. రాజబాబుతో ఉన్న శ్రీనివాసరావుకూ గాయాలు కావడంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. నిందితులను యానాం సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ హత్య వెనుక మరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనేది పూర్తి విచారణలో తేలనుందని సీఐ వివరించారు.
సంబంధిత కథనం:murder: కోపంగా చూశాడని ప్రాణం తీశారు