రేణిగుంటలో అగ్నిప్రమాదం.. ఇద్దరు పిల్లలతో సహా డాక్టర్ మృతి - ఇద్దరు పిల్లలతో సహా డాక్టర్ మృతి
Tirumala fire accident
By
Published : Sep 25, 2022, 7:16 AM IST
|
Updated : Sep 26, 2022, 9:10 AM IST
07:14 September 25
కార్తీక చిన్నపిల్లల ఆస్పత్రిలో చెలరేగిన మంటలు
రేణిగుంటలో అగ్నిప్రమాదం.. ఇద్దరు పిల్లలతో సహా డాక్టర్ మృతి
Fire Accident in Renigunta: విద్యుదాఘాతం వైద్యుడి కుటుంబాన్ని బలి తీసుకుంది. మంటలు చెలరేగడంతో పాటు దట్టంగా వ్యాపించిన పొగలతో ఊపిరాడక ఇద్దరు చనిపోగా మరొకరు అగ్నికీలలకు సజీవదహనమయ్యారు. ఈ విషాదఘటనలో భర్త, పిల్లలను కోల్పోయిన మహిళ బోరున విలపించింది. మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అగ్నిమాపక శాఖ చేసిన ప్రయత్నాలతో మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు.
తిరుపతి జిల్లా రేణిగుంట పరిధిలోని భగత్‌సింగ్ కాలనీలో ఆదివారం వేకువజామున ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో వైద్యుడు రవిశంకర్‌రెడ్డి (45) అగ్నికి ఆహుతవగా ఆయన కుమారుడు భరత్ సిద్దార్థరెడ్డి (11), కుమార్తె కార్తీక (7) పొగతో ఉక్కిరిబిక్కిరై ఊపిరాడక చనిపోయారు. రవిశంకర్‌రెడ్డి, ఆయన భార్య అనంతలక్ష్మి వైద్యులే. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.
రేణిగుంట పరిధిలోని భగత్‌సింగ్ కాలనీలో కుమార్తె పేరుతో కొత్తగా ఆసుపత్రిని నిర్మించి ఇటీవల ప్రారంభించారు. భవనం కింది అంతస్తులో ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. మొదటి, రెండో అంతస్తులను ఇంటి కోసం వినియోగిస్తున్నారు. ఆదివారం వేకువజామున 3.30 గంటల ప్రాంతంలో అందరూ నిద్రిస్తుండగా వంట గదిలో విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ జరిగినట్లు అగ్నిమాపక అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. వంట గది నుంచి ఇతర గదులకు వేగంగా మంటలు వ్యాపించాయి. దీనికితోడు వంట గ్యాస్ లీకవడంతో మంటలు వ్యాపించి, దట్టమైన పొగ అన్ని అంతస్తులకూ వ్యాపించిందని అధికారులు తెలిపారు.
మొదటి అంతస్తులో ఓ పడక గదిలో నిద్రిస్తున్న అనంతలక్ష్మి పొగకు లేచి బాల్కనీలోకి చేరుకుని రక్షించాలంటూ కేకలు వేశారు. మరో గదిలో ఉన్న రవిశంకర్‌రెడ్డి తల్లి రామసుబ్బమ్మ, పిల్లలు భరత్, కార్తీక పొగకు ఉక్కిరిబిక్కిరయ్యారు. బాత్‌రూంలోకి వెళ్తే పొగ రాదని భావించి ఇద్దరు చిన్నారులు అందులోకి వెళ్లి తలుపు వేసుకున్నారు. రామసుబ్బమ్మ అదే గదిలో ఉండిపోయారు. పొగ మొత్తం బాత్‌రూంలోకి చేరడంతో ఇద్దరు చిన్నారులు ఊపిరాడక స్పృహ కోల్పోయారు. రెండో అంతస్తులో ఉన్న రవిశంకర్‌రెడ్డి కింద ఉన్న తమ కుటుంబ సభ్యులను కాపాడేందుకు మొదటి అంతస్తుకు చేరుకున్నారు. అప్పటికే మంటలు వ్యాపించడంతో ఆయన పూర్తిగా కాలిపోయారు.
అగ్నిమాపకశాఖ అధికారులు వచ్చేలోపే..
తెల్లవారుజామున ఘటన జరగటంతో ఎవరూ గుర్తించలేదని, అందువల్లే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ఘటనాస్థలికి కొద్ది దూరంలో ఉన్న ఇళ్లవారు పరిస్థితిని గమనించి అగ్నిమాపకశాఖ అధికారులకు ఫోన్ చేశారు. వేకువజామున 4.40 గంటల ప్రాంతంలో ఫోన్ వచ్చిందని, 20 నిమిషాల్లోనే 4 యంత్రాలతో అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశామని అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపారు. నిచ్చెన సాయంతో పైకెక్కి కిటీకి అద్దాలు పగలగొట్టి, రామసుబ్బమ్మ, అనంతలక్ష్మిలను రక్షించారు. బాత్‌రూంలో స్పృహ తప్పి పడి ఉన్న చిన్నారులిద్దరినీ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి రవిశంకర్‌రెడ్డి పూర్తిగా కాలిపోయారు. ముగ్గురి మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు.
వెంటిలేషన్ సరిగా లేకపోవడంతోనే..
ఇంటికి సరైన వెంటిలేషన్ లేకపోవడం ముగ్గురి మృతికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఏసీల ఏర్పాటు కోసం కిటికీలు మొత్తానికి అద్దాలు పెట్టారు. దీంతో పొగ బయటకెళ్లే మార్గం లేక ఇల్లంతా దట్టంగా కమ్ముకున్నట్లు అగ్నిమాపకశాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు. ఇంటి అలంకరణలో వినియోగించిన వస్తువుల్లోని రసాయనాలతోపాటు కర్టెన్లు, సోఫాలు మంటలు త్వరగా వ్యాప్తి చెందేందుకు కారణమయ్యాయని చెబుతున్నారు. అయితే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఎందుకు జరిగిందో తెలియాల్సి ఉంది.