తెలంగాణలోని జీడిమెట్ల పారిశ్రామికవాడలోని నాసెన్స్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్యాక్టరీలో... ఉదయం 8:30 గంటలకు ప్రమాదం సంభవించింది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి నాలుగు ఫైర్ ఇంజిన్లు, ఆరు నీటి ట్యాంకర్లు చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది సుమారు గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో షిఫ్ట్ ఇంఛార్జ్ హరిప్రసాద్ రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. అతడి పరిస్థితి కొంత విషమంగా ఉందని ఫ్యాక్టరీ నిర్వాహకులు తెలిపారు. మిగిలిన వారిలో అర్జున్, మనీష్ బస్కీకి స్వల్పగాయాలయ్యాయి. ఇద్దరినీ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇదే ఫ్యాక్టరీలో ఉదయం షిఫ్ట్‌లో పనిచేసే ఉద్యోగి విజయ్.. ప్రమాదం తర్వాత కనిపించడం లేదని సహచర ఉద్యోగులు తెలిపారు. ప్రమాద ఘటన చూసి విజయ్ పారిపోయాడా..? లేదా ఏమైనా జరిగిందా..? అనే వివరాలు తెలియాల్సి ఉందని ఫ్యాక్టరీ నిర్వాహకులు తెలిపారు.
FIRE ACCIDENT: జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం.. ముగ్గురికి తీవ్రగాయాలు - రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం
తెలంగాణ రాష్ట్రంలోని జీడిమెట్ల పారిశ్రామికవాడలోని ఓ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది.సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి నాలుగు ఫైర్ ఇంజిన్లు, ఆరు నీటి ట్యాంకర్లు చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది సుమారు గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి.
"ఈ ఫ్యాక్టరీలో.. సోడియం అమైండ్ టూ అమిలో పిరడిన్ను తయారు చేస్తారు. మార్నింగ్ షిఫ్ట్ సమయంలో ఫ్యాక్టరీలోని బాయిలర్ అకస్మాత్తుగా ఆగిపోయింది. ఆ తర్వాత దానికదే తిరిగి ప్రారంభమైంది. బాయిలర్‌లోని వేడి ఆయిల్ రియాక్టర్‌కు చేరుకుని.. సాల్వెంట్ ట్రేసెస్ మూలంగా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ముగ్గురు గాయపడగా... అందరినీ ఉస్మానియా ఆస్పత్రికి తరలించాం. ఇంకో వ్యక్తి కన్పించట్లేదు అంటున్నారు. అతడు పారిపోయాడా.. ఇంకేమైనా జరిగిందా అనేది తెలియాల్సి ఉంది."- శ్రీనివాస్ రెడ్డి, ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్
ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో ఒక్కో రియాక్టర్లో పేలుళ్లు సంభవించాయి. ఫ్యాక్టరీలో మొత్తం 10 రియాక్టర్లు ఉండగా... అగ్నిప్రమాదంలో నాలుగు రియాక్టర్లు పేలిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో పక్కనే కెమికల్ డ్రమ్ములు ఉండడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. మంటల నుంచి తప్పించుకునేందుకు ముగ్గురు సిబ్బంది ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. హరిప్రసాద్ రెడ్డి శరీరం చాలా వరకు కాలిపోయిందని.. వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించామన్నారు. అర్జున్, మనీష్ అనే ఇద్దరు సిబ్బంది.. పైనుంచి దూకడంతో ఇద్దరికీ కాళ్లు విరిగాయని.. వాళ్లను కూడా ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.