ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

బాణసంచా దుకాణంలో అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి - జింఖానా మైదానంలో అగ్నిప్రమాదం

FIRE ACCIDENT AT FIREWORKS SHOP
FIRE ACCIDENT AT FIREWORKS SHOP

By

Published : Oct 23, 2022, 9:40 AM IST

Updated : Oct 24, 2022, 6:49 AM IST

09:36 October 23

జింఖానా మైదానంలోని దుకాణంలో పేలిన బాణసంచా

FIRE ACCIDENT AT FIREWORKS SHOP : ‍అధికార వైకాపా నేతల ఒత్తిళ్లు.. అగ్నిమాపక, పోలీసు, నగరపాలక, విద్యుత్తు శాఖ అధికారుల నిర్లక్ష్యం.. విజయవాడలో రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. జింఖానా మైదానంలో బాణసంచా దుకాణాల్లో జరిగిన పేలుడులో రెక్కాడితే కానీ డొక్కాడనీ రెండు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పెట్రోల్‌ బంకు పక్కనే బాణసంచా దుకాణాల ఏర్పాటు చేస్తే ప్రమాదమని తెలిసినా నేతల ఒత్తిడితోనే అనుమతులు ఇచ్చారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. మరోవైపు బాధిత కుటుంబాలు తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

జింఖానా మైదానంలో దీపావళికి మొత్తం 19 దుకాణాలకు నగరపాలక సంస్థ అధికారులు అనుమతి ఇచ్చారు. 16వ నెంబరు దుకాణానికి వ్యాన్‌ నుంచి టపాసులను కిందకి దించే క్రమంలో మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే అగ్నికీలలు ఇతర దుకాణాలకు వ్యాపించాయి. అటూ ఇటూ ఉన్న 15, 17 దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి. దుకాణం వెనుక నిద్రలో ఉన్న ఇద్దరు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. దుకాణ నిర్వాహకుడు గోపాలకృష్ణమూర్తి స్పృహతప్పి పడిపోయారు.

గుండెపోటు కూడా రావడంతో వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి ప్రధాన కారణం నాటు చిచ్చుబుడ్లను భారీగా తీసుకురావడమే అని ప్రాథమికంగా పోలీసు, అగ్నిమాపక అధికారులు అంచనా వేస్తున్నారు. ఘటనపై సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దుకాణ నిర్వాహకుడు గోపాలకృష్ణమూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇద్దరి మరణానికి కారణమయ్యారని కేసు పెట్టారు.
జింఖానా మైదానం నగరపాలక సంస్థ ఆధీనంలో ఉంటుంది. దీని విస్తీర్ణం 1.75 ఎకరాలు. ఇందులో దుకాణాల ఏర్పాటుకు వీఎంసీ అనుమతి ఇచ్చింది. తర్వాత.. వీఎంసీలోని అగ్నిమాపక విభాగం, విద్యుత్తు, పోలీసులు అన్నీ సక్రమంగానే ఉన్నాయని అనుమతులు ఇచ్చారు. గతంలో పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసేవారు. ఆ సమయంలో ఇక్కడ డిమాండ్‌ ఉండేది కాదు. ఈసారి అక్కడ అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేస్తుండటంతో మైదానం మూసివేశారు.

దీనికి ప్రత్నామ్నాయంగా నగరంలో పలు చోట్ల జిల్లా యంత్రాంగం షాపుల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ఇవి ఏమాత్రం చాలకపోవడంతో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు నగరపాలక సంస్థ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఆఖరు నిమిషంలో జింఖానా మైదానంలో ఏర్పాటు చేయించారు. ఈనెల 18న హడావుడిగా దరఖాస్తులు ఆహ్వానించారు. సమయం లేకపోవడంతో మరుసటి రోజే ఖారారు చేశారు. దీని వెనుక డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రమాదం జరిగిన ప్రాంతానికి కేవలం పది మీటర్ల దూరంలోనే పెట్రోల్‌ బంకు ఉంది. టపాసుల దుకాణానికి నిబంధనల ప్రకారం ఇక్కడ అనుమతి ఇవ్వకూడదు. కానీ నేతల ఒత్తిళ్ల కారణంగా తలాడించారు. నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలు కేటాయించడం వల్లే ప్రమాదం జరిగిందని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పెట్రోల్‌ బంకు సిబ్బంది కరెంటు సరఫరా నిలిపివేసి పెట్రోల్‌ పంపుకు సరఫరా అయ్యే లైన్ల కనెక్షన్లు నిలిపివేశారు. నిప్పురవ్వలు సమీపంలోని ఇళ్లపై పడినప్పటికీ పెట్రోల్‌ బంకుపై పడకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది.
నిబంధనల ప్రకారం ప్రతి దుకాణం మధ్య 3మీటర్ల దూరం ఉండాలి. కానీ జింఖానా మైదానంలో ఏర్పాటు చేసిన దుకాణాల మధ్య నాలుగు అడుగులు కూడా లేదు. అందుకే మూడు దుకాణాలకు మంటలు త్వరగా వ్యాపించడానికి కారణమైంది. మైదానంలో ఫైర్‌ ఇంజిన్‌ ఏర్పాటు చేయాలంటే.. అగ్నిమాపక శాఖకు రోజుకు రూ. 20 వేలు చొప్పున వ్యాపారులు చెల్లించాలి. ఇంకా వ్యాపారం ప్రారంభం కాకపోవడంతో ఆదివారం చెల్లిస్తామని చెప్పారు. ఇంతలోనే ప్రమాదం చోటుచేసుకుంది. దీనిని ముందే తెచ్చిపెట్టి ఉంటే ప్రాణనష్టం జరిగేది కాదు.

ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే మల్లాది విష్ణు, సీపీఎం నేత బాబూరావు పరిశీలించారు. పెట్రోల్ బంక్ పక్కన బాణసంచా దుకాణాలకు ఎలా అనుమతిచ్చారని బాబూరావు ప్రశ్నించారు. విజయవాడ నగరపాలక కమిషనర్ స్వప్నిల్ దినకర్‌, సీపీ కాంతిరాణా టాటా.. ఘటనాస్థలాన్ని సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. చిచ్చుబుడ్లు పేలడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలిసిందని.. సమగ్ర విచారణ నిర్వహించి పూర్తి విషయాలు తెలుసుకుంటామని సీపీ చెప్పారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 24, 2022, 6:49 AM IST

ABOUT THE AUTHOR

...view details