Father And Daughter Died in Train Accident: విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మధుపాడ గ్రామంలో దారుణం జరిగింది. రైలు పట్టాలపై పరిగెత్తుతున్న కుమార్తెను కాపాడబోయి కుమార్తెతో సహా తండ్రి రైలు ప్రమాదంలో మృతి చెందారు. ఎం లింగాలవలసకు చెందిన బెల్లాన తవుడు, అతని కుమార్తె శ్రావణి విజయనగరం నుంచి బొబ్బిలి వైపు వెళుతున్న రైలు కింద పడి ప్రాణాలు కోల్పొయారు.
విజయనగరంలో విషాదం.. రైలు కిందపడి తండ్రి, కుమార్తె మృతి - train accidents in Vizianagaram
14:33 October 22
మృతులు దత్తిరాజేరు మండలం ఎస్.లింగాలవలస వాసులుగా గుర్తింపు
ఇద్దరు వ్యక్తులు పడిపోయినట్లు గజపతినగరం స్టేషన్ మాల్తేరు నుంచి సమాచారం అందిందని గజపతినగరం పోలీసులు అన్నారు. మృతుని భార్య భవాని ఇచ్చిన వివరాల ప్రకారం.. తవుడు కుమార్తెను తీసుకుని మధుపాడలో గల చుట్టాల ఇంటికి వచ్చాడు. అక్కడి నుంచి ద్విచక్రవాహనంపై రైలు పట్టాలవైపు కుమార్తెను తీసుకుని వెళ్ళగా.. ఆమె రైలు పట్టాల వెంబడి పరుగెత్తింది. రైలు రాకను గమనించిన తండ్రి పరుగెత్తి, బాలికను రక్షించబోగా ఇద్దరిని రైలు ఢీకొనడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కుమార్తెకు మతిస్థిమితం లేదని తల్లి తెలిపింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను శవపరీక్షకు గజపతినగరం ఆసుపత్రికి పంపించినట్లు వెల్లడించారు.
రోడ్డున పడిన కుటుంబం:లింగాలవలస గ్రామంలో మంచి పేరున్న మృతుని మరణంతో.. ఆ కుటుంబం ఆసరా కోల్పోయి రోడ్డున పడిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తవుడుకు ఇద్దరు కుమార్తెలు కాగా పెద్ద కుమార్తె శ్రావణి మతిస్థిమితం లేకుండా పెరిగింది. చిన్నకుమార్తె విజయలక్ష్మి ప్రస్తుతం గ్రామంలో నాలుగో తరగతి చదువుతోంది. కుటుంబాన్ని పోషించేంది తవుడు మాత్రమే ఈయన గత కొన్ని సంవత్సరాలుగా కౌలురైతు వద్ద పనిచేస్తున్నాడు. పొలం పనుల్లో మంచి నమ్మకంతో పని చేసేవాడని.. ఎలాంటి వివాదాలకు తావులేకుండా ఉండేవాడని గ్రామస్థులు చర్చించుకుంటున్నారు. ఈయన మరణంతో గ్రామంలో విషాదం నెలకొంది.
ఇవీ చదవండి: