అందరితో నవ్వుతూ మాట్లాడే ఆ కుటుంబసభ్యులు.. అర్థాంతరంగా తనువు చాలించారు. కుటుంబంలో నెలకొంటున్న వరుస విషాదాలతో.. మనస్తాపానికి గురై బలవన్మరణం పొందారు. రాత్రి వరకు కలివిడిగా ఉన్న మనుషులు.. ఉదయానికి విగత జీవులుగా మారడం కర్నూలులో స్థానికంగా అందర్నీ కలచివేసింది.
కర్నూలులో విషం తాగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య
09:59 June 23
మనస్తాపానికి గురై ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య
కర్నూలు నగరంలోని వడ్డెగేరి ప్రాంతానికి చెందిన 42 ఏళ్ల ప్రతాప్.. టీవీ మెకానిక్ దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆయనకు భార్య హేమలత(36), డిప్లొమో చదువుతున్న 17ఏళ్ల కుమారుడు జయంత్, ఏడోతరగతి చదువుతున్న కుమార్తె రిషిత ఉన్నారు. వడ్డెగేరి ప్రాంతంలో అందరితో కలిసి మెలిసి ఉండేవారు. ప్రతాప్ ఎప్పుడూ నవ్వుతూ అందరితో స్నేహంగా ఉండేవారు. రాత్రి పొద్దుపోయే వరకు వీధిలో అందరితో బాగానే ఉన్నారు. ఉదయం ఎంతసేపటికీ బయటకు రాకపోయేసరికి.. అనుమానం వచ్చిన బంధువులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. తలుపు తెరచి చూడగా..నలుగురూ ఓ గదిలో విగతజీవులుగా పడి ఉన్నారు.
గత ఏడాది మొదటి దశ కరోనా సమయంలో ప్రతాప్ తల్లిదండ్రులిద్దరూ మృతి చెందారు. ఈ నెలలోనే తమ్ముడి భార్య అనారోగ్యంతో మరణించింది. బంధువులు వరుసగా చనిపోవడంతో మనస్తాపానికి గురైన ప్రతాప్ కుటుంబం.. పాలలో విషం కలుపుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. మృతదేహాలను మార్చురీకి తరలించారు. అందరితో సంతోషంగా ఉండే.. ప్రతాప్ కుటుంబం ప్రాణాలు తీసుకోవటంతో స్థానికంగా విషాదం నెలకొంది. పోస్టుమార్టం తర్వాత మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.
ఇదీ చదవండి:50 వేల కొత్త కేసులు-1300 మరణాలు