Fake rc's given by senior assistant: కృష్ణా జిల్లా నందిగామ ఆర్టీవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎన్.విఠల్ ఉన్నతాధికారిగా అవతారమెత్తాడు. ఆయిల్ ట్యాంకర్లు లేకుండానే వాటికి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు (ఆర్సీలు) సృష్టించినట్లు అధికారులు గుర్తించారు. ప్రాంతీయ రవాణా అధికారి (ఆర్టీవో), మోటారు వాహన ఇన్‌స్పెక్టర్ (ఎంవీఐ)గా అవతారమెత్తి వారి స్థానంలో అతడే లేని 11 ట్యాంకర్లకు ఆర్సీలు రూపొందించినట్లు విచారణలో తేల్చారు.
ఇతర రాష్ట్రాల వాహనాలను మన రాష్ట్రానికి తీసుకొచ్చాక.. ఇక్కడ రీ-రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు వాహనాన్ని ఎంవీఐ పరిశీలించి, ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేస్తారు. తర్వాత ఆర్టీవో పరిశీలించి ఆమోదిస్తారు. అయితే సీనియర్ అసిస్టెంట్ విఠల్.. ఎంవీఐ, ఆర్టీవోల పేరిట తానే లాగిన్ ఐడీలు, పాస్‌వర్డ్‌లు తయారు చేశాడు. దీనికి రవాణాశాఖ కమిషనరేట్‌లో కొందరి సహకారం తీసుకున్నట్లు తెలుస్తోంది. విజయవాడకు చెందిన ఏజెంట్ ఈశాన్య రాష్ట్రాల నుంచి లారీలేవీ తీసుకురానప్పటికీ.. ఎంవీఐ పరిశీలించినట్లు, ఆర్టీవో కూడా ఆమోదించినట్లు విఠల్ చూసుకునేవారు. వాటికి తన ఇంటి నుంచే ఆర్సీలు సృష్టించడమే కాకుండా, రవాణాశాఖ ఈ-ప్రగతి వెబ్‌సైట్‌లోనూ ఆ వివరాలు అప్‌లోడ్ చేసేవారు. ఓ సీనియర్ అసిస్టెంట్ ఇంత చేస్తున్నా పైఅధికారులు గుర్తించలేకపోవడం విమర్శలకు తావిస్తోంది.