MURDER: జీవితంలో అండగా ఉండాల్సిన అన్న.. తమ్ముడికి ఆపద తలపెట్టాడు. తాగిన మైకంలో విచక్షణ కోల్పోయి తోడబుట్టిన వాడిని కానరాని లోకాలకు పంపించాడు. ఎవరికి అనుమానం రాకుండా ఉండడానికి ఇంటి వెనుక ఉన్న స్థలంలో పూడ్చిపెట్టాడు.అయితే సోదరి ఫిర్యాదుతో.. దర్యాప్తు జరిపిన పోలీసులకు హత్యకు గల కారణం తెలుసుకుని అవాక్కయ్యారు.
పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. 'బాపట్ల జిల్లా మార్టూరు మండలం ద్రోణాదుల గ్రామంలోని ద్రోణాదుల యానాది కాలనీకి చెందిన నాగులూరి గాంధీ (27)ని.. అతడి అన్న చెన్నకేశవులు మద్యం మత్తులో కొడవలితో గొంతుకోసి హత్య చేశాడు. గాంధీ, చెన్నకేశవులు ఇద్దరూ కలిసి దొంగతనాలు చేసేవారు. అలా సంపాదించిన మొత్తాన్ని తన అన్న చెన్నకేశవుల దగ్గర ఉంచుకోవడంతో.. గాంధీకి అవసరం అయినప్పుడు డబ్బులు అడగడానికి కూడా ఇబ్బందిగా ఉండటంతో.. రావలసిన డబ్బులు మొత్తం ఇవ్వమని అడిగాడు. దాంతో మాటామాటా పెరిగి వివాదం చెలరేగింది. తాగిన మైకంలో అన్న.. తమ్ముడిని కత్తితో గొంతుకోసి చంపి, మృతదేహాన్ని తమ ఇంటి వెనుక పూడ్చిపెట్టాడు' అని మార్టూరు సీఐ ఆంజనేయ రెడ్డి వెల్లడించారు.