ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

హైదరాబాద్‌లో ఈడీ సోదాలు.. శ్రీలంక క్యాసినో ఏజెంట్ల ఇళ్లలో తనిఖీలు - ED Raids in Chikoti praveen house in Hyderabad

ED Raids in Hyderabad Today : ఫెమా నిబంధనలు ఉల్లంఘిస్తూ క్యాసినోలు నిర్వహిస్తున్న కొందరి ఇళ్లపై ఈటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో మొత్తం 8 ప్రాంతాల్లో తనిఖీ చేస్తున్నారు. శ్రీలంక క్యాసినో ఏజెంట్లు చీకోటి ప్రవీణ్, మాధవ రెడ్డి ఇళ్లలో ముందుగా సోదా చేస్తున్నారు. పలు పత్రాలతో పాటు కంప్యూటర్లు, చరవాణీలు స్వాధీనం చేసుకున్నారు.

ED
ED

By

Published : Jul 27, 2022, 5:08 PM IST

Updated : Jul 28, 2022, 7:23 AM IST

.

ED Raids in Hyderabad Today : జూదం మాటున నిధుల మళ్లింపునకు పాల్పడుతున్నారన్న అనుమానంతో పలువురు టూర్‌ ఆపరేటర్లపై హైదరాబాద్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విరుచుకుపడింది. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా గుడివాడలో క్యాసినో నిర్వహణ మొదలు విదేశాల్లోనూ ప్రత్యేక ఈవెంట్ల పేరుతో జూదమాడించేందుకు జనాన్ని తరలిస్తున్న వీరి ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. ఈ సోదాలు రాజకీయ, వ్యాపారవర్గాల్లో కలకలం రేపుతున్నాయి. కొందరు ప్రముఖులు జూదం ఆడేందుకు విదేశాలకు వెళ్లిన వివరాలన్నీ ఈడీ సోదాల్లో బయటపడటమే ఇందుకు కారణం. గోవాలో క్యాసినోలు నిర్వహించడంతోపాటు నేపాల్‌, థాయ్‌లాండ్‌లలో జరిగే జూదంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు చెందిన చీకోటి ప్రవీణ్‌, మాధవరెడ్డి సహా కొందరు ప్రత్యేక టూర్లు ఏర్పాటు చేస్తున్నారు. రానుపోను ఖర్చులతో కలిపి 5 రోజులపాటు విదేశాల్లో ఉండేందుకు ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. గతంలో ఎక్కువ మందిని శ్రీలంక తీసుకెళ్లేవారు. అక్కడి పరిస్థితులు బాగోకపోవడంతో నేపాల్‌కు తరలిస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకు బోయిన్‌పల్లిలోని మాధవరెడ్డి ఇంట్లో సోదాలు జరగ్గా.. సైదాబాద్‌లోని చీకోటి ప్రవీణ్‌ ఇంట్లో అర్ధరాత్రి సోదాలు కొనసాగాయి. జూబ్లీహిల్స్‌ తదితర మరో 8 ప్రాంతాల్లో ఈడీ బృందాలు సోదాలు మొదలుపెట్టాయి. సాయంత్రం వరకూ జరిగిన ఈ సోదాల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జూదం ఆడటానికి ఉపయోగించే టోకెన్లు పెద్ద మొత్తంలో దొరికినట్లు సమాచారం. జూద పర్యటనలను నిర్వహించే ఆపరేటర్ల కార్యాలయాలపై ఈడీ దాడులు నిర్వహించినట్లు తెలియగానే తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, అధికారులు వణికిపోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రవీణ్‌, మాధవరెడ్డి సంక్రాంతికి గుడివాడలో క్యాసినో ఏర్పాటు చేయటం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పట్లో వారికి సహకరించినవారు ఈడీ దాడులతో ఉలిక్కిపడుతున్నారు. కొంతమంది ముందు జాగ్రత్తగా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు.

.

ఫెమా ఉల్లంఘన: జూద పర్యటనలవల్ల ఫెమా ఉల్లంఘనలు జరిగినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. జూదం ఆడేందుకు దొడ్డిదారిలో విదేశాలకు సొమ్ము తీసుకెళుతున్నారని, గెలుచుకున్న డబ్బును దొడ్డిదారిలోనే స్వదేశానికి రప్పించుకుంటున్నారని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ మధ్యకాలంలో నగరానికి చెందిన ఓ వ్యక్తి పెద్ద మొత్తంలో జూదంలో గెలుచుకొని దాన్ని హవాలా మార్గంలో స్వదేశానికి రప్పించినట్లు ఈడీకి సమాచారం అందిందని, దాని ఆధారంగానే దాడులు నిర్వహించారని తెలుస్తోంది.

సినీతారలతో సంబంధాలు:ఈ జూద పర్యటనలు నిర్వహించేవారికి టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌కు చెందిన అనేకమంది సినీతారలతో మంచి సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఏళ్ల నుంచే చీకటి దందా:చీకోటి ప్రవీణ్‌ చీకటి దందా ఏళ్ల క్రితం నుంచే నడుస్తోంది. గోవా, శ్రీలంక, నేపాల్‌, థాయ్‌లాండ్‌లలో క్యాసినోల నిర్వహణతోపాటు స్థానికంగానూ జూదం సాగించి అతడు పోలీసులకు చిక్కిన ఉదంతాలున్నాయి. నగరంలోని కొన్ని క్లబ్‌లు ఇతడి కనుసన్నల్లో నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

*నగర శివార్లలోని తన ఫామ్‌హౌస్‌లో కొండచిలువలు, రామచిలకలు, గుర్రాలు, ఉడుములు, ఆస్ట్రిచ్‌, బాతుల్లాంటి వన్యప్రాణుల్ని చీకోటి ప్రవీణ్‌ పెంచుకుంటున్నట్లు తాజా పరిణామాలతో బహిర్గతమైంది. కార్లలో ఆయా వన్యప్రాణుల్ని విహారానికి తీసుకెళ్తూ ఆ వీడియోల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంచేవాడు. ఈ వ్యవహారం బయటపడటంతో అటవీశాఖ అధికారులు విచారణ జరుపుతున్నట్లు తెలిసింది.

నేపాల్‌లో అడ్డా:ప్రవీణ్‌ ఇటీవలి కాలంలో నేపాల్‌పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తన దందాకు ప్రచారం కోసం పలువురు సినీతారల్ని వినియోగించాడు. గత నెలలో జరిగిన క్యాసినో కోసం అమీషా పటేల్‌, ఈషా రెబ్బా, డింపుల్‌ హయతీ, ముమైత్‌ఖాన్‌తో ప్రచారం చేసి ఆ వీడియోల్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పెట్టుకున్నాడు. తాము ఆ క్యాసినోకు వస్తున్నట్లు సినీతారలతో చెప్పించి పెద్ద ఎత్తున పంటర్లను ఆకర్షించాడు.

ఎవరీ మాధవరెడ్డి?:బోయిన్‌పల్లిలో నివాసం ఉండే మాధవరెడ్డి 6 నెలల క్రితం వరకు ఈవెంట్‌ ఆర్గనైజర్‌గా పనిచేసేవాడు. గతంలో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మాధవరెడ్డి ప్రవీణ్‌ దందాలోభాగస్వామిగా చేరిన తర్వాత బాగా సంపాదించినట్లు తెలుస్తోంది. ఈడీ దాడి సమయంలో మాధవరెడ్డి కారుపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి చెందిన ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఉండటం గమనార్హం.

ఇద్దరు ముఖ్య నాయకుల పరిచయంతో..:తెలంగాణకు చెందిన చీకోటి ప్రవీణ్‌.. గతంలో గోవాలోని ఓ క్యాసినోలో టేబుల్‌ నిర్వాహకుడిగా పనిచేసేవారు. గన్నవరం, గుడివాడ నియోజకవర్గాలకు చెందిన ఇద్దరు నాయకులు అక్కడికి తరచూ వెళ్తుండటంతో వారితో ప్రవీణ్‌కు పరిచయం, సాన్నిహిత్యం ఏర్పడ్డాయి. వారి ద్వారానే గుడివాడలో క్యాసినో ఏర్పాటు చేశారు. ఆ ఒక్క ఈవెంట్‌ ద్వారానే కోట్లలో కూడబెట్టారు.

గుడివాడ క్యాసినో నివేదిక ఏమైంది?:సంక్రాంతికి గుడివాడలో క్యాసినో నిర్వహణపై వివాదం చెలరేగటంతో అప్పట్లో నూజివీడు డీఎస్పీ శ్రీనివాస్‌ను విచారణాధికారిగా నియమించారు. కానీ ఆ నివేదిక బయటకు రాలేదు. ఎవరిపైనా కేసులైనా పెట్టలేదు. తాజాగా ఈడీ సోదాల నేపథ్యంలోనైనా నాటి నివేదికను బయటపెట్టాలనే డిమాండ్లు వస్తున్నాయి.

ఇవీ చూడండి:

Last Updated : Jul 28, 2022, 7:23 AM IST

ABOUT THE AUTHOR

...view details