Drugs Smuggling in Telangana : తెలంగాణ రాష్ట్రంలో మత్తుమందులు విధ్వంసం సృష్టిస్తున్నాయి. వాడకందారులు పెరగడంతో అంతర్జాతీయ మాదకద్రవ్యాల ముఠాలు రాష్ట్రంపై కన్నేశాయి. తన ఉనికి బయటపడకుండా దేశవ్యాప్తంగా డ్రగ్ స్మగ్లింగ్ చేస్తున్న టోనీతో పాటు మరికొందరిని హైదరాబాద్ పోలీసులు తాజాగా అరెస్టు చేయడంతో మరోమారు డ్రగ్స్ తుట్టె కదిలింది. గత ఏడాది రాష్ట్రంలో దాదాపు రూ.200 కోట్లకు పైగా విలువైన మత్తుమందులు స్వాధీనం చేసుకోగా, పట్టుబడకుండా వినియోగదారులకు చేరింది ఇంతకు నాలుగైదు రెట్లు ఉంటుందన్న అంచనాలు పరిస్థితి తీవ్రతను చాటుతున్నాయి.
2013లో తాత్కాలిక వీసాపై ముంబయికి వచ్చిన టోనీ.. వీసా గడువు ముగిసినా నగరంలో ఉంటూ డ్రగ్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. టోనీకి స్టార్‌య్ అనే అంతర్జాతీయ డీలర్.. ఓడల ద్వారా సరుకు పంపిస్తున్నట్లు గుర్తించాం. వాటిని ప్రధాన నగరాలకు సరఫరా చేస్తున్నాడు. నగరంలో 13 మంది ప్రముఖులకు ఈ డ్రగ్స్‌ను విక్రయించారు. రూ.వెయ్యి కోట్ల వ్యాపారం చేసే నిరంజన్ జైన్ సైతం డ్రగ్స్ తీసుకున్నారు. నిరంజన్ జైన్ 30 సార్లు డ్రగ్స్ తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. చాకచక్యంగా వ్యవహరించి టోనీతో పాటు 9 మందిని అరెస్టు చేశాం.
--- సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ
ఉత్పత్తికీ స్థావరంగా..
Drug Smuggler Tony Arrest : రసాయన మాదకద్రవ్యాల ఉత్పత్తికీ హైదరాబాద్ స్థావరంగా మారింది. జీడిమెట్ల పారిశ్రామికవాడలో 2020 డిసెంబరు నెలలో డీఆర్‌ఐ అధికారులు ఇలాంటి కర్మాగారాన్ని కనుగొని మూడువేల కిలోలకు పైగా మెఫెడ్రన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అదే ఏడాది ఆగస్టులోనూ హైదరాబాద్ శివార్లలోని మత్తుమందుల కర్మాగారంలో సోదాలు చేసి, రూ.47 కోట్ల విలువైన రసాయన మత్తుమందులు, రూ.50 కోట్ల విలువైన ముడి పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. నాచారం పారిశ్రామికవాడలో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు కూడా ఇలాంటి కర్మాగారాన్నే స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది నవంబరులో డీఆర్‌ఐ అధికారులు రూ.5.5 కోట్ల విలువైన 14 కిలోల ఎపిడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఉత్తరాంధ్రలో పండుతున్న గంజాయి అటు బెంగళూరు, ఇటు మహారాష్ట్ర, రాజస్థాన్, దిల్లీ, గుజరాత్ తదితర రాష్ట్రాలకు తెలంగాణ మీదుగానే సరఫరా అవుతోంది.
సాంకేతిక పరిజ్ఞానంతో ఎత్తుగడలు