ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Drug rocket: అడ్డూ అదుపు లేని దందా.. పొలాల్లో మత్తు రాకెట్లు..!

ప్రకాశం జిల్లాలో మత్తు పదార్థాల దందా అడ్డూ అదుపూ లేకుండా జరుగుతోంది. త్రిపురాంతకం మండలం కె.అన్నసముద్రం గ్రామ సమీపంలోని పొలాల్లో మత్తు రాకెట్​ వెలుగులోకి వచ్చింది. చిన్నస్థాయి కుటీర పరిశ్రమలో గోదాము ఏర్పాటుచేసి మత్తు పదార్థాలు ఉంచడం ఆశ్చర్యపరుస్తోంది.

Drug rocket at prakasham distrcit
Drug rocket at prakasham distrcit

By

Published : Jul 3, 2021, 5:42 PM IST

ప్రకాశం జిల్లాలో తరచూ మత్తు పదార్థాలు పెద్ద సంఖ్యలో పట్టుబడుతున్నాయి. ఇటీవల అమనిగుడిపాడు పంచాయతీ అటవీ ప్రాంతంలో సారా తయారీకి అవసరమైన నీటి సరఫరాకు 4 కిలోమీటర్ల పైపులైను నిర్మించి అక్రమార్కులు అధికారులకే షాక్‌ ఇచ్చారు. ఇప్పుడు నిషేధిత పదార్థాలతో మత్తు బిళ్లలు తయారు చేసేందుకు చేసుకున్న ఏర్పాట్లు.. తాజా దాడుల్లో వెలుగుచూశాయి. తెలంగాణ పోలీసులు ఒకసారి నిందితులను అరెస్టు చేసినా పరిస్థితిలో మార్పురాలేదు. ఇది పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో జరగడం గమనార్హం.

ఏం జరిగిందంటే..

గత ఏడాది డిసెంబరు నెలలో తెలంగాణలోని సైబరాబాద్ పోలీసులు.. హైదరాబాద్ నగరంలోని రామచంద్రాపురంలో పోలీసులు తనిఖీలు చేశారు. ఆల్ఫాజోలమ్‌ అనే మత్తు మందులు పట్టుపడ్డాయి. కిలో వరకు సీజ్‌ చేశారు. విలువ రూ.3 లక్షలు ఉంటుందని, విక్రయించేందుకు మధ్యవర్తులకు కమిషన్‌గా ప్యాకెట్‌కు రూ.5 వేలు ఇస్తున్నట్లు నాడు నివేదికల్లో పొందుపరిచారు. త్రిపురాంతకంలో తయారుచేసిన మత్తు పదార్థాలనే ప్యాకెట్ల రూపంలో తెలంగాణలోని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో కొందరు యువతకు విక్రయిస్తున్నరనే అభియోగాలు మోపారు. అయితే ఇదే కేసులో స్థానికంగా కీలకంగా వ్యవహరించే మరో ఇద్దరిని అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నించిన తెలంగాణ పోలీసులకు సాధ్యపడలేదు. ఓ అధికారి ముందస్తు సమాచారంతో వారు తప్పించుకున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం మార్కాపురం సెబ్‌ యూనిట్‌ పరిధిలోని వైపాలెం సర్కిల్‌ త్రిపురాంతకంలో ఇతర జిల్లాల అధికారులు మత్తు పదార్థాల తయారీ కేంద్రంపై దాడులు జరపడం సంచలనం కలిగించింది. తాజాగా మళ్లీ అవి దొరకడం గమనార్హం.

కుటీర పరిశ్రమ తరహాలో..

వ్యవసాయ క్షేత్రంలో చిన్నస్థాయి కుటీర పరిశ్రమలో గోదాము ఏర్పాటుచేసి మత్తు పదార్థాలు ఉంచడం ఆశ్చర్యపరుస్తోంది. మార్కాపురం ఏఈఎస్‌ శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ దందా వెనుక ఉన్న బడా వ్యక్తులెవరో అధికారుల విచారణలో తేలాల్సి ఉంది. పశ్చిమ ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా, సారా తయారీ వంటి వ్యాపారాలు నిర్వహిస్తూ అక్రమార్జనకు కొందరు తెరలేపుతున్నారు. ఈ ప్రాంతంలో స్థానిక అధికారులు జరిపిన దాడుల కన్నా జిల్లాస్థాయి అధికారుల దాడుల్లో పట్టుబడినవే అధికం. మత్తు కోసం తాటి, ఈత కల్లు తాగడం కొన్ని ప్రాంతాల్లో ఆనవాయితీ. ఇందులో స్థాయికి మించి కిక్కు కోసం క్లోరల్‌ హైడ్రేట్‌, డైజోఫామ్‌ వంటివి కలుపుతున్న దాఖలాలున్నాయి. ఆల్ఫాజోలమ్‌తో గంజాయి వంటి నిషేధిత పదార్థాలనూ మిశ్రమం చేస్తుంటారు. ఇప్పుడు అలాంటివే పట్టుబడటం సంచలనం కలిగిస్తోంది.

ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం

"సెబ్‌ అధికారులు సీజ్‌ చేసిన మత్తు పదార్థాలను పరీక్షిస్తున్నాం... డైజోఫామ్‌లో గంజాయి కలిసి ఉన్నట్లు తెలుస్తోంది. డైజోఫామ్‌ కూడా తీవ్ర స్థాయి మత్తు పదార్థమే... దీనిని పరీక్షించడానికి హైదరాబాద్‌ పంపిస్తున్నాం...వృక్షాలనుంచి సహజసిద్ధంగా వచ్చే కల్లు వల్ల ప్రమాదం ఉండదు... మత్తు కూడా ఉండదు. కల్లుతో మత్తు కావాలనుకునే వారు ఈ పదార్థాలు వినియోగిస్తున్నారు.. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. యువతే లక్ష్యంగా అక్రమార్కులు ఈ వ్యాపారం సాగిస్తుంటారు." - జె.షకిలాదేవి, రసాయనాల పరీక్షకులు, ప్రాంతీయ ఎక్సైజ్‌-ప్రొహిబిషన్‌ ల్యాబ్‌, గుంటూరు

ఇదీ చదవండి:

ఎంపీ రఘురామ ఫిర్యాదుపై కేంద్ర హోంశాఖ స్పందన.. నివేదిక ఇవ్వాలని సీఎస్​కు ఆదేశం

ABOUT THE AUTHOR

...view details