MLC: కాకినాడ ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్ కారులో మృతదేహం ఉండటం కలకలం రేపింది. అది కూడా ఉదయ్ భాస్కర్ వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్న వ్యక్తిదే కావడం.. నిన్న ఎమ్మెల్సీనే సదరు డ్రైవర్‌ను బయటకు తీసుకెళ్లడంతో.. ఏం జరిగిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఏం జరిగిందంటే? : ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్ నిన్న ఉదయం.. కారులో తనతోపాటు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని తీసుకెళ్లారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు.. ప్రమాదం జరిగిందంటూ డ్రైవర్ తమ్ముడికి.. సమాచారం ఇచ్చారు ఎమ్మెల్సీ ఉదయ్‌భాస్కర్. ఆ తర్వాత తన కారులోనే డ్రైవర్ మృతదేహాన్ని తీసుకొచ్చిన ఎమ్మెల్సీ.. తెల్లవారుజామున 2 గంటలకు మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఏం జరిగిందని కుటుంబ సభ్యులు అడగ్గా.. ప్రమాదం జరిగిందని ఎమ్మెల్సీ చెప్పారని, సరైన సమాధానం చెప్పాలని అడగ్గా.. మృతదేహాన్ని కారులోనే వదిలేసి, వేరే కారులో వెళ్లిపోయారని మృతుని బంధువులు తెలిపారు. దీంతో.. తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. మృతుడు సుబ్రహ్మణ్యం.. ఎమ్మెల్సీ వద్ద ఐదేళ్లుగా డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇప్పుడు ఉన్నట్టుండి మరణించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఎమ్మెల్సీని అరెస్టు చేయాలని డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్య అపర్ణ డిమాండ్:ఎమ్మెల్సీని అరెస్టు చేయాలని డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్య అపర్ణ డిమాండ్ చేసింది. తన భర్త మృతదేహాన్ని చూసి ఆమె కన్నీరుమున్నీరుగా విలిపించింది. ఎమ్మెల్సీ వద్ద తీసుకున్న డబ్బుల విషయమై గతంలో తన కుమారుడ్ని బెదిరించారని...ఇప్పుడు చంపేశారని మృతుడు సుబ్రహ్మణ్యం తల్లి ఆరోపించారు.
అడ్డుకున్న తెదేపా నేతలు: కాకినాడ జీజీహెచ్‌కు మృతదేహం తరలించేందుకు పోలీసులు రాగా.. మృతదేహం తరలించకుండా సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యుల అంబులెన్స్‌ను ఆపేశారు. అనంతరం కుటుంబసభ్యులకు సర్దిచెప్పి అంబులెన్స్‌లో మృతదేహాన్ని పోలీసులు తీసుకెళ్తుండగా.. మార్గమధ్యలో అంబులెన్స్‌ను తెదేపా నాయకులు అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కొండబాబు ఆధ్వర్యంలో తెదేపా నాయకుల ఆందోళన నిర్వహించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం చేయాలని తెదేపా డిమాండ్ చేశారు. అనంతర పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులను ఫోన్లో పరామర్శించిన లోకేశ్:డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులతో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఫోన్లో మాట్లాడారు. సుబ్రహ్మణ్యం తల్లి, భార్యను ఫోనులో పరామర్శించిన లోకేశ్.. న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడిని అన్యాయంగా చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఉదయ్ భాస్కర్‌ను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కట్టు కథ అల్లి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వైకాపా ప్రజాప్రతినిధిని కాపాడేలా పోలీసులు వ్యవహరించడం దారుణమన్నారు. కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకునే విధంగా ఒత్తిడి తీసుకొస్తామని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: