Deceased Farmers Families :;తెలంగాణ రాష్ట్రంలో రైతు వెతలు మరోసారి తెరపైకి వచ్చాయి. సాగు సంక్షోభం, అప్పుల బాధలతో చనిపోయిన రైతుల కుటుంబాల కన్నీటి కథలు ఆవేదన కలిగించాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత వ్యవసాయంలో నష్టాలొచ్చి 7వేల మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సర్కారు సాయం అందించి ఆదుకోవాలంటూ బాధిత కుటుంబాలు వేడుకుంటున్నాయి. ప్రభుత్వం 194 జీవో ప్రకారం వెంటనే పరిహారం చెల్లించాలంటూ హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. కార్యక్రమంలో రైతు ఆత్మహత్యలు - బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లింపులపై ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి బాధిత రైతు కుటుంబాల మహిళలు తరలివచ్చి.. తమ ఇంటిపెద్దను కోల్పోయాక ఎదుర్కొన్న పరిస్థితులను, పడుతున్న బాధలను వివరించారు. 250 కుటుంబాల మహిళలు తమ గోస వినిపించి కన్నీటి పర్యంతమయ్యారు.
అధికశాతం కౌలుదారులే..
Deceased Farmers Families Telangana : ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో అధిక శాతం కౌలుదారులే. బ్యాంకు రుణాలు, రైతుబంధు, బీమా సదుపాయం లేక.. కౌలురైతులు సాగు చేసి మరింత అప్పుల్లో కూరుకుపోతున్నారు. రుణాలు తీర్చలేక ఒక్కో కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు చనిపోతున్నారు. ఏళ్లు గడుస్తున్నా పరిహారం అందడంలేదని బాధిత మహిళా రైతులు వాపోయారు.