ప్రస్తుతం సాంకేతికత పెరగడం వల్ల దేశంలో సరాసరి ప్రతి కుటుంబానికి మొబైల్ ఫోన్(mobile phone) అందుబాటులో ఉంది. అందులో సగానికి పైగానే అంతర్జాలం(Internet) వినియోగిస్తున్నారు. ప్రతి విషయాన్ని గూగుల్‌లోనే తెలుసుకోవడం పరిపాటి. ఏదైనా వస్తువులు కొనుగోలు చేయాలన్నా ఈ-కామర్స్‌ను ఆశ్రయిస్తున్నారు. వీటి అవసరంతో అంతర్జాల వినియోగం బాగా విపరీతంగా పెరిగిపోయింది. గతేడాది నుంచి అంతర్జాల వినియోగదారుల సంఖ్య మరింత ఎక్కువైంది.
కొవిడ్ కారణంగా విద్యార్థులకు సైతం ఆన్‌లైన్ పాఠాలే కొనసాగుతున్నాయి. బయట కూడా స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితిలో కంప్యూటర్ ముందు కూర్చొని కాలక్షేపం కోసం వీడియోగేమ్‌లు ఆడటం, కొంతమంది యువత అశ్లీల వెబ్‌సైట్లను ఆశ్రయిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ఇదే అదునుగా భావించి మోసాలకు పాల్పడుతున్నారు. ఏడాదిన్నరగా సైబర్ మోసాల ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. ఎక్కడో ఉండి సైబర్ మోసాలు చేసే నేరగాళ్లను పట్టుకోవడం పోలీసులకు కత్తిమీద సాములా మారింది. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, బిహార్ లాంటి ఉత్తరాది రాష్ట్రాల నుంచి సైబర్ నేరగాళ్ల ముఠాలు ఎక్కువగా బ్యాంకు, బీమా, బహుమతి, ఉద్యోగం, ఓఎల్ఎక్స్ పేరిట మోసాలకు పాల్పడుతున్నారు. ఒక్క నేరగాడిని అక్కడికి వెళ్లి పట్టుకొని వచ్చే లోపు మరో నేరగాడు సైబర్ నేరాలకు పాల్పడుతున్నాడు. ఇలాంటి నేరాలను నియంత్రించేందుకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో "సైబర్ యోధ" (Cyber Yodha) కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
అవగాహన కల్పించేందుకే 'సైబర్ యోధ'
సైబర్ నేరగాళ్లు సైతం సాంకేతికంగా పోలీసుల కంటే ఎంతో ముందుంటున్నారు. పోలీసులు ఆ మోసాలను గుర్తించి తెలుసుకొని ప్రజలకు అవగాహన కల్పించే లోపు మరో తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. వీటిని అధిగమించడానికే పోలీసులు ఇప్పుడు సమాజంలో సైబర్ మోసాల పట్ల ఉద్ధతంగా అవగాహన కల్పించేందుకు శ్రీకారం చుట్టారు. కేవలం పోలీసులే కాకుండా... ప్రజల్ని భాగస్వాములను చేసుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో 'సైబర్ యోధ' పేరిట అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సమాజంలోని విభిన్న వర్గాల వారిని ఎంపిక చేసి వాళ్లకు సైబర్ మోసాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.
సైబర్ యోధకు ఎంపికైన వారికి శిక్షణ
సైబర్ యోధ (Cyber Yodha) కార్యక్రమానికి శిక్షణ కోసం దాదాపు 3 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. కంప్యూటర్‌తో తో పాటు సైబర్ నేరాలపై కనీస అవగాహన ఉండాలనే ఉద్దేశంతో పోలీసులు ఆన్‌లైన్ పరీక్ష ద్వారా 110 మందిని ఎంపిక చేశారు. వాళ్లలోనూ విభిన్న వర్గాలకు చెందిన వాళ్లున్నారు. కేవలం విద్యార్థులే కాకుండా ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలకు చెందిన వాళ్లు కూడా ఇందులో ఉన్నారు. 21 మంది విద్యార్థులు, 31 మంది ఐటీ ఉద్యోగులు, 6 మంది పదవీ విరమణ పొందిన వాళ్లు, 33 మంది సమాజానికి చెందిన వాళ్లు, ఇద్దరు రక్షణ రంగ ఉద్యోగులున్నారు. ఎంపికైన వారికి 40 గంటల పాటు ఎండ్ నౌ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు.