తెలంగాణలోని కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన కస్తూరి నరసింహులు అనే రైతు 20 రోజుల క్రితం యూట్యూబ్‌లో ఐదు రూపాయల నోటు మీ దగ్గర ఉంటే మీరు లక్షాధికారి అనే వీడియో చూశాడు. అది చూసిన సెకన్లలోనే సంబంధిత వ్యక్తులు నరసింహులుకు ఫోన్ చేశారు. మీదగ్గర ట్రాక్టర్ బొమ్మ ఉన్న నోటు ఉందా అని అడగగానే ఉందని చెప్పడంతో మీకు 11.74 లక్షలు వస్తాయి అని చెప్పారు. ఒక్కసారి మీ వద్ద ఉన్న 5 రూపాయల నోటును ఫొటో తీసి వాట్సాప్‌లో పెట్టమంటే సదరు వ్యక్తి ఫోన్ నంబర్‌కు పంపాడు. కొంత సమయం తర్వాత సదరు వ్యక్తి ఫోన్ చేసి వావ్ 11.74 లక్షలు మీ సొంతం అని ఫోన్ చేశాడు.
ఇదీ నిజమని నమ్మిన బాధితుడు డబ్బులు వస్తే ముగ్గురు కూతుళ్ల ఉన్నత చదువులకు ఉపయోగపడతాయని ఆనందపడ్డాడు. మళ్లీ సదరు వ్యక్తి ఫోన్ చేసి మీ డబ్బు మీకు చేరాలంటే దానికోసం మీరు ఒక అకౌంట్ తీయాల్సి ఉంటుంది. దానికి డబ్బులు ఖర్చవుతాయి అని మొదటగా లక్ష రూపాయలు అకౌంట్లో వేయించుకున్నారు. ఆ తర్వాత ఎన్ఓసీ, ఐటీ అంటూ 20 రోజుల వ్యవధిలోనే మొత్తం 8.35 లక్షలు వారికి అకౌంట్లో డబ్బులు జమ చేశాడు.