Facebook Alert: అమ్మాయిలు ఫేస్‌బుక్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త!!
Morphing Photos: బ్లాక్‌మెయిల్, వేధింపులు లక్ష్యంగా కొందరు యువతులను, విద్యార్థులను వేధిస్తున్నారు. సోషల్ మీడియాలో ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పెట్టి.. తరువాత చాటింగ్ చేసి.. యువతుల ఫోటోలను తీసుకుని.. తరువాత వారి నిజస్వరూపం బయటపెడతారు. ఫోటోలను మార్ఫ్ చేసి.. డబ్బులివ్వాలని డిమాండ్ చేస్తారు. సోషల్ మీడియా ద్వారా బాధితులవుతున్న వారిలో ఎక్కువ మంది ఫేస్‌బుక్ వినియోగదారులే ఉంటున్నారని పోలీసులు వెల్లడిస్తున్నారు.
అమ్మాయిలు ఫేస్‌బుక్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త
By
Published : Dec 2, 2021, 9:18 AM IST
Facebook: సర్.. రెండు రోజుల క్రితం తెలియని నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. నీ ఫేస్‌బుక్ ఖాతాలో ఉంచిన ఫొటోలు అసభ్యంగా మార్చాను. కాసేపట్లో వాటిని అప్‌లోడ్ చేస్తున్నా. అలా చేయొద్దంటే నేను చెప్పిన బ్యాంక్ ఖాతాలో రూ.50వేలు వేయాలి. లేదంటే మరోగంటలో నీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోని వీడియోలు అశ్లీలంగా మార్చి మీ స్నేహితులకు వాట్సాప్‌లో పంపుతా. డబ్బు పంపేందుకు సిద్ధంగా ఉండు అన్నాడు. కాస్త గడువివ్వండి.. అని కోరి, స్నేహితురాలి సూచనతో మీ వద్దకు వచ్చా.. అతడి నుంచి రక్షించండి.
- సైబర్ క్రైమ్ పోలీసుల ముందు సికిందరాబాద్ మారేడ్‌పల్లికి చెందిన ఓ యువతి వెళ్లబోసుకున్న గోడు ఇది.
నిజానికి హైదరాబాద్‌లో చాలామంది యువతులు, విద్యార్థినులు ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ రకం బెదిరింపులకు నేపథ్యం.. ఫేస్‌బుక్‌లో వారు తరచూ ఫొటోలు, వీడియోలు పెడుతుండడమే. తమ పోస్టులకు ఎన్ని లైక్‌లు వస్తున్నాయో తెలుసుకునేందుకు యువతులు ఇలా చేస్తున్నారు. ఈ బలహీనతనే సైబర్ నేరస్థులు దొరకబుచ్చుకుంటున్నారు. యువత పెట్టే చిత్రాలకు అసభ్యత జోడించి.. వారిని బెదిరిస్తూ, వేధిస్తూ, నగదు డిమాండ్ చేస్తున్నారు. అందుకే సామాజిక మాధ్యమాలు వినియోగించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండంటూ పోలీసులు సూచిస్తున్నారు.
ఫేస్‌బుక్ వాడేవారే బాధితుల్లో అధికం..
సోషల్ మీడియా ద్వారా బాధితులవుతున్న వారిలో ఎక్కువ మంది ఫేస్‌బుక్ వినియోగదారులే ఉంటున్నారని, మెట్రో నగరాల్లో నమోదవుతున్న సైబర్ నేరాల్లో 70 శాతం ఫేస్‌బుక్ ద్వారా జరిగిన ఈవ్‌టీజింగ్, బెదిరింపుల కేసులే ఉంటున్నాయని పోలీసులు చెబుతున్నారు. వేధింపులు, బ్లాక్‌మెయిల్ చేసేవారు యువతులు, విద్యార్థినులను లక్ష్యంగా ఎంచుకుని ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. వారిలో కొందరు పరిచయస్తులే కాగా.. మరికొందరు దిల్లీ, ముంబయిల్లో ఉంటున్న సైబర్ నేరస్థులని విశ్లేషించారు. ఫేస్‌బుక్ ఖాతాలకు ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను పంపుతున్న దుండగులు.. తర్వాత బాధితులతో చాటింగ్ చేస్తున్నారు. అనంతరం వ్యక్తిగత ఫొటోలు, ఫోన్‌నంబర్లను తీసుకుని వేధింపులు ప్రారంభిస్తున్నారు. వాటిని భరించలేక.. కొందరు యువతులు ఆత్మహత్యాయత్నాలు చేస్తున్నారు.
నేరాలకు వేదిక
అవసరమైన సమాచారంతో పాటు యువతులు, విద్యార్థినుల అభిరుచులు ఫేస్‌బుక్ ద్వారా తెలుస్తుండడంతో కొందరు నేరస్థులు వాటి ఆధారంగా మోసాలకు పాల్పడుతున్నారు. ఫేస్‌బుక్‌లో ఖాతాలున్న వారు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. కేవలం ఫోన్ నంబర్లు, ఇ-మెయిల్ ద్వారా మొత్తం సమాచారాన్ని నేరస్థులు తస్కరిస్తున్నట్లు వారు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే.. కాస్త ఆలోచించి వారితో మసులు కోవాలని.. గుడ్డిగా నమ్మకూడదని సూచిస్తున్నారు.
జాగ్రత్తలు పాటించాలి..
ఫేస్‌బుక్ ఖాతాల్లో వ్యక్తిగత ఫొటోలు ఉంచొద్దు. చిరునామాలు, ఫోన్ నంబర్లు పెట్టొద్దు. మీ ప్రొఫైల్‌ను ఇతరులు చూడకుండా తాళం వేయండి.
నేరస్థులు, మోసగాళ్లలో 90 శాతం మంది సొంతపేర్లతో ఫేస్‌బుక్ ఖాతాలు తెరవరు. అందులో వారిచ్చే వివరాలన్నీ కల్పితాలే. వాటిని నమ్మి మోసపోవద్దు.
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఫేస్‌బుక్ వేదికగా బాధితులయ్యే వారి ఫిర్యాదులు వేగంగా పెరుగుతున్నాయి. నిందితుల్లో కొందరు బాధితులకు తెలిసిన వారే ఉంటున్నారు.