అచ్చం అసలైన ప్రొఫైల్‌ను పోలినట్టే ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతా సృష్టిస్తారు. ఆ వ్యక్తి స్నేహితుల జాబితాలోని వారందరికీ మళ్లీ కొత్తగా ఫ్రెండ్ రెక్వెస్టులు పంపిస్తారు. వాటిని అనుమతించిన కొద్దిసేపటికే మెసెంజర్‌లో హాయ్ అని పలకరిస్తారు. ఎక్కడున్నావ్? అంటూ చనువుగా అడుగుతారు. సమాధానమిచ్చేలోపే మీకు గూగుల్ పే ఉందా? ఫోన్ పే ఉందా? అని ప్రశ్నిస్తూ నేరుగా అసలు విషయంలోకి వచ్చేస్తారు. అత్యవసరంగా కొంత డబ్బు అవసరముందని, పంపిస్తే రేపు ఉదయమే తిరిగి ఇచ్చేస్తానని చెప్పి పన్నాగానికి తెరలేపుతారు. మనకు తెలిసిన వ్యక్తే కదా! ఎంతో అవసరముంటేనే ఇలా డబ్బులు అడుగుతారు కదా! అని భావించి.. వారు ఇచ్చిన నంబర్లకు డబ్బులు పంపించారో మీరు మోసపోయినట్టే. ఫేస్‌బుక్ వేదికగా సైబర్ కేటుగాళ్లు అనుసరిస్తున్న సరికొత్త నేరవిధానమిది. వీరి ఉచ్చులో చిక్కుకుని వేల మంది డబ్బులు పొగొట్టుకుంటున్నారు. ఇటీవల ఈ తరహా ఘటనలు బాగా పెరిగాయి. మొదట్లో పోలీసు అధికారులు, వైద్యులు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తుల పేరిట ఫేస్‌బుక్‌లో నకిలీ ప్రొఫైల్స్‌ను సృష్టించి వాటిని అడ్డం పెట్టుకుని డబ్బులు దోచుకున్న సైబర్ నేరగాళ్లు.. ఇప్పుడు సామాన్యుల పేరిట నకిలీ ఖాతాలు సృష్టించి సొమ్ములు కొల్లగొడుతున్నారు.
అక్కడి ముఠాల పనే..
*ఈ తరహా నేరాలకు పాల్పడుతున్న వారిలో ఎక్కువ మంది రాజస్థాన్‌లోని భరత్‌పుర, నోయిడా, ఒడిశా, పశ్చిమబెంగాల్ తదితర ప్రాంతాలకు చెందిన వారే.
*వీరికి తెలుగు సరిగ్గా రాకపోవడంతో మెసెంజర్‌లో ఇంగ్లీష్‌లోనే సందేశాలు పంపిస్తున్నారు. తెలుగులో ఇవతలి వ్యక్తులు ఏం సమాధానమిచ్చినా సరే.. అవేవి పట్టించుకోకుండా.. నేరుగా గూగుల్ పే ఉందా? ఫోన్ పే ఉందా? డబ్బులు పంపించండి? అంటూ అడుగుతున్నారు.
*కొందరికి మొదట్లోనే వాటిపై సందేహం వచ్చి.. నకిలీ ప్రొఫైల్ ఎవరి పేరునైతే ఉందో వారిని సంప్రదించి నిజంగానే డబ్బులు అడిగారా? లేదా? అని తెలుసుకుంటున్నారు. మరికొందరు నకిలీ ఖాతాల ముసుగులో ఉన్న నేరగాళ్లకు డబ్బులు చెల్లించేసి ఆ తర్వాత డబ్బులు అందాయా? లేదా? అనే విషయాన్ని నిర్ధారించుకునేందుకు ఫోన్ చేసినప్పుడు మోసపోయామని గుర్తిస్తున్నారు.