Cyber crime news : లాభాల పేరిట వల.. రెండు నెలల్లో రూ.300 కోట్ల మోసం Cyber crime news: దిల్లీ కేంద్రంగా డిజిటల్ మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరస్థులు... వైద్య పరికరాల తయారీ, విక్రయాల పేరిట.. నగదు కాజేసేందుకు పక్కా ప్రణాళికను రచించారు. సెల్‌ఫోన్ నెట్‌వర్క్ కంపెనీల పొరుగు సేవల విభాగాల నుంచి మెట్రో నగరాల్లో ఉంటున్న వారి ఫోన్ నంబర్లను గంపగుత్తగా కొంటున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరవాసుల వివరాలను పరిశీలించి జాబితాను తయారు చేసుకుంటున్నారు. లైఫ్ లైన్ ఎఫ్‌క్యూ మార్కెట్స్ లిమిటెడ్, యాక్సన్, మాల్ 008 యాప్‌ల పేర్లతో వాట్సప్ నంబర్లకు లింకులు పంపుతున్నారు. లింక్‌లు క్లిక్ చేయగానే... బాధితులతో ఛాటింగ్ ప్రారంభించి వారికి డీ మ్యాట్ తరహాలో ప్రత్యేకంగా ఓ డిజిటల్ ఖాతాను ప్రారంభిస్తున్నారు. కానీ అందులోంచి నగదు విత్‌డ్రా చేసే అప్షన్ సైబర్ నేరస్థుల చేతుల్లోనే ఉండేలా చూసుకుంటున్నారు.
తొలుత లాభాలు... ఆ తర్వాతే..
మెహిదీపట్నంలో నివాసముంటున్న ఓ మహిళ ఫోన్‌కు వచ్చిన లింకును తెరిచి... రోజుకు వంద, రెండు వందలు మదుపు చేయడం ప్రారంభించింది. లాభాలు క్రమం తప్పకుండా వస్తుండడంతో.. ఆ విషయాన్ని ఆమె భర్తకు వివరించింది. దీంతో కేవలం నెలలోనే నాలుగున్నర లక్షల రూపాయలు మదుపుచేశాడు. లాభం రాకపోగా.. లవ్‌లైఫ్ నేచర్ యాప్ వారి ఫోన్లలో స్తంభించిపోయింది.
5 కోట్లు వచ్చిందని చెప్పి..
పాతబస్తీలోని మీర్‌చౌక్‌లో ఉంటున్న వ్యాపారి ఆశపడి.. ఇదే తరహాలో తొలుత లక్షన్నర మదుపు చేశాడు. లాభాలు వస్తున్నాయంటూ.. ఏకంగా రూ.36 లక్షలు యాప్‌లో ఉంచాక.. ఆయన ఖాతాలో 5 కోట్ల రూపాయలు నగదు జమైందని సైబర్ కేటుగాళ్ల నుంచి ఫోన్ వచ్చింది. తీరా విత్‌డ్రా చేసేందుకు యత్నించగా.. సంబంధిత యాప్ పనిచేయడం ఆగిపోయింది. ఇలాంటి తరహా మోసాలు కోకొల్లలుగా బయటపడుతున్నారు.
అమెరికాలో మూలాలు.. చైనా కంపెనీల ప్రమేయంపై..
Love life and health care Apps: లవ్ లైఫ్ నేచర్, హెల్త్‌కేర్ వెబ్‌సైట్, యాప్‌లో లక్షల్లో మదుపు చేసి.. మోసపోయిన వారు విజయవాడ, హైదరాబాద్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. బాధితులు తెలిపిన వివరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీస్ అధికారులు.. లవ్‌లైఫ్ నేచర్ కంపెనీపై దృష్టి కేంద్రీకరించారు. ఈ వెబ్‌సైట్‌ను అమెరికా అరిజోనాలో మూణ్నెళ్ల క్రితం ప్రారంభించినట్లు గుర్తించారు. చైనా కంపెనీల ప్రమేయంపైనా ఆరా తీసుకున్నారు. దిల్లీలోని ఓ కార్యాలయాన్ని ప్రారంభించి పదిమందిని నియమించుకున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ సంస్థ నగదు లావాదేవీలను పరిశీలించగా.. రెండు నెలల్లోనే సుమారు రూ.300 కోట్ల మేర కొల్లగొట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇదీచూడండి:THEFT VIRAL VIDEO: ఏమీ దొరక్క.. టిషర్ట్‌తోపాటు ద్విచక్రవాహనం ఎత్తుకెళ్లిన దొంగ