ఫేస్‌బుక్‌లో నకిలీ ప్రొఫైల్స్‌ను సృష్టించి.. ‘ఇబ్బందుల్లో ఉన్నాం.. కొంచెం డబ్బులు సర్దండి’ అంటూ మిత్రులు, బంధువులకు సందేశాలు పంపించారు. నిజమేననుకుని కొందరు సదరు కేటుగాళ్లు సూచించిన నంబర్లకు గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం ద్వారా బదిలీ చేశారు. తీరా అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు. ఇలాంటి తరహా ఫిర్యాదులు తరచూ అందుతుండటంతో సైబర్‌క్రైం పోలీసులు అప్రమత్తమై సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా అవగాహన కల్పించారు.
రూటు మార్చారు.. :
ఫేస్‌బుక్ మోసాలపై అందరికీ అవగాహన రావడంతో ఇప్పుడు కేటుగాళ్లు రూట్ మార్చారు. వాట్సాప్ వేదికగా వల విసురుతున్నారు. వాట్సాఫ్ డీపీ అసలు వ్యక్తిది ఉంచి సన్నిహితులు, బంధువులకు సందేశాలు పంపిస్తున్నారు. ‘చికిత్సకు భారీగా ఖర్చయింది, ఇప్పటివరకు దాచి పెట్టిందంతా అయిపోయింది, మిగిలిన బ్యాలెన్స్ కట్టకపోతే డిశ్చార్జి చేయరంట’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నా ఫోన్ దగ్గర లేదని, ఆసుపత్రికి సంబంధించిన సిబ్బంది నంబర్‌కు గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం చేయాలని సూచిస్తున్నారు. ‘అయ్యో.. అక్కడ ఎలా ఉందో’ అనుకుంటూ.. నంబర్ చూడకుండానే చాలా మంది హడావుడిగా డబ్బులు పంపించేస్తున్నారు.