సైబర్ నేరస్థుల ఆగడాలకు అడ్డుకట్ట లేకుండా పోతోంది. వ్యాపారుల నుంచి ఉద్యోగుల వరకు ఎవ్వరినీ వదలని కేటుగాళ్లు.. పోలీసులకు సైతం చుక్కలు చూపిస్తున్నారు. హైదరాబాద్ నారాయణగూడ సీఐ సతీమణికీ.. సుమారు లక్ష రూపాయలు టోకరా వేశారు. ఆన్‌లైన్‌లో 500 రూపాయలు విలువ చేసే చీరను.. సీఐ సతీమణి ఆర్డర్ చేశారు. తీరా వచ్చిన పార్శిల్‌లో చీర లేకపోవటంతో.. గూగుల్‌లో వెతికి సంబంధింత సంస్థ కస్టమర్ కేర్ నంబరు తెలుసుకొని ఫోన్ చేశారు. ప్యాకింగ్‌లో పొరపాటు జరిగిందన్న అవతలి వ్యక్తి.. డబ్బులు తిరిగి చెల్లిస్తామని చెప్పి.. బ్యాంక్ ఖాతా నంబరు తెలుసుకొని క్యూఆర్ కోడ్ పంపించాడు. ఆ లింక్‌పై క్లిక్ చేయగానే.. 45 వేలు మాయమయ్యాయి. ఇదేంటని అడిగితే పొరపాటు జరిగిందంటూ.. మరో కోడ్ పంపించాడు. ఇలా మూడు దఫాలుగా ఆమె ఖాతా నుంచి 59 వేలు కొట్టేశాడు.
హైదరాబాద్ ముషీరాబాద్‌కు చెందిన ఓ టీసీఎస్ ఉద్యోగి నుంచి సైబర్ నేరగాళ్లు సుమారు 4 లక్షలు కాజేశారు. ఓ ప్రముఖ సంస్థ పేజీ తెరుచుకునేలా ఆమె చరవాణికి లింక్ పంపించారు. ఆ యువతికి ఫోన్ చేసి షేర్ మార్కెట్ ట్రెండింగ్‌లో ఉన్నందున..పెట్టుబడి పెడితే నాలుగు రెట్లు వస్తోందని నమ్మించారు. నాలుగు లక్షలు ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేయగానే సొమ్ము మెుత్తం స్వాహా చేశారు. మరో కేసులో బజాజ్ ఫైనాన్స్ ద్వారా రుణం ఇప్పిస్తామని చెప్పి.. తాడ్‌బంద్‌కు చెందిన అనిల్ కుమార్ నుంచి బ్యాంకు వివరాలు సేకరించిన సైబర్ నేరగాళ్లు.. 9 లక్షల 44 వేలు నొక్కేశారు.