Chinese gang arrested for cheating in investments: వివిధ రకాల పెట్టుబడుల పేరుతో ప్రజలను మోసం చేస్తూ దేశ వ్యాప్తంగా వందల కోట్ల రూపాయలను కాజేసిన నేరగాళ్ల గుట్టును హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో ఇద్దరు చైనీయులు సహా 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలియజేశారు.
నిందితులు రూ.903 కోట్ల మేర మోసానికి పాల్పడినట్లు గుర్తించామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు. మనీ ఎక్స్ఛేంజీల ద్వారా భారత కరెన్సీని డాలర్లుగా మార్చారని చెప్పారు. డాలర్లుగా మార్చి ఇతర దేశాలకు హవాలా మార్గంలో తరలించారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రూ.903 కోట్ల మేర మోసాలకు పాల్పడ్డారని వెల్లడించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పు కలిగించే మోసంగా సీవీ ఆనంద్ తెలిపారు.
ప్రధాన నిందితుడు చైనాకు చెందిన చు చున్ యూగా గుర్తించామని సీవీ ఆనంద్ తెలిపారు. ఆర్బీఐ అనుమతి పొందిన నగదు ఎక్స్ఛేంజీల ద్వారా లావాదేవీలు జరుగుతున్నట్లు గుర్తించామని తెలియజేశారు.పెట్టుబడుల పేరుతో వచ్చిన యాప్‌లో తార్నాక వాసి పెట్టుబడి పెట్టారని తెలిపారు. లాక్సమ్ యాప్‌లో రూ.1.6 లక్షలు పెట్టుబడి పెట్టి మోసపోయారని సీవీ ఆనంద్ చెప్పారు.
క్సిండై టెక్నాలజీకి చెందిన వీరేందర్ ఖాతాలో నగదు జమ అయినట్లు గుర్తించామని సీవీ ఆనంద్ పేర్కొన్నారు. చైనా వాసి జాక్ ఆదేశాల మేరకు ఖాతా తెరిచినట్లు వీరేందర్ చెప్పాడని తెలిపారు. ఆన్‌లైన్ బ్యాంకింగ్ వివరాలు జాక్‌కు వీరేందర్ ఇచ్చాడని సీవీ ఆనంద్ వెల్లడించారు.