గుంటూరులో ఈ నెల 15న బీటెక్ విద్యార్థిని రమ్య హత్యోదంతం రాష్ట్రాన్నే కాదు. దేశాన్నీ ఉలిక్కిపడేలా చేసింది. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే శశికృష్ణ అనే యువకుడు దారుణంగా యువతిని నరికి చంపాడు. ఈ నెల 17న రాజుపాలెంలో బాలికను ఇంట్లో నిర్బంధించి వివాహితుడొకరు అత్యాచారానికి పాల్పడ్డారు. అంతకుముందు తాడేపల్లిలో యువతిపై సామూహిక అత్యాచార ఘటన, ఇటీవల కాలంలో చిన్నారులపై అత్యాచార ఘటనలు జిల్లా వాసుల్ని గగుర్పాటుకు గురిచేశాయి. రాజధాని ప్రాంతం కావడం, పేరున్న కళాశాలలు ఉండటంతో జిల్లాకు కొత్తవారి తాకిడి కొన్నాళ్లుగా పెరిగింది. తాడేపల్లి, మంగళగిరి, గుంటూరు వంటి ప్రాంతాల్లో గంజాయి, ఇతర మత్తుపదార్థాల వాడకం పెరగడం.. పల్నాడు ప్రాంతాన్ని తెలంగాణ మద్యం ముంచెత్తడం వంటి కారణాలు కూడా నేరాలకు ఆజ్యం పోస్తున్నాయి.
అంతం చూస్తున్న ఆస్తులు, భూవివాదాలు..
గుంటూరు జిల్లాలో తాజాగా చోటుచేసుకున్న సత్తెనపల్లి, రాయవరం ఘటనలు మరింత ఆందోళనకు గురిచేశాయి. ఆస్తి వివాదమై సత్తెనపల్లి నాగార్జున నగర్లో ఇరుకుటుంబీకుల మధ్య తలెత్తిన వివాదం.. ఇద్దరు మహిళల ప్రాణాలను బలిగొంది. సమీప బంధువే తల్లీకుమార్తెలను దారుణంగా నరికిచంపిన ఘటన భయభ్రాంతులకు గురి చేసింది. కేవలం ఆస్తి వివాదం.. ఇద్దరు అమాయక మహిళలను బలితీసుకోవడం అందరినీ కలవరపర్చింది.
తాజాగా.. మాచర్ల మండలం రాయవరంలో మాజీ సైనికుడు సాంబశివరావు.. దారుణానికి ఒడిగట్టాడు. భూ తగాదాల నేపథ్యంలో.. తుపాకీతో ఇద్దర్ని పొట్టన పెట్టుకున్నాడు. 8 రౌండ్ల పాటు అతి దగ్గర నుంచి జరిపిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. ఇలా.. ఎటూతేలని భూవివాదాలు మనుషుల్ని ఉన్మాదులుగా మారుస్తున్నాయి. భూ క్రయ, విక్రయాలు, వాటిని రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో నిర్లక్ష్యం, ఏళ్ల తరబడి అవి ఎవరి ఆధీనంలో ఉన్నాయో.. తేలేలోగానే వారసులు మారడం, వేరొకరి చేతులు మారడం వంటి సమస్యలు భూ వివాదాలకు హేతువులుగా మారుతున్నాయి. ప్రభుత్వం సమగ్ర సర్వే ద్వారా అసలైన హక్కుదారుల్ని గుర్తిస్తే భూ సమస్యలు తగ్గి.. తద్వారా నేరాలు తగ్గుముఖం పట్టే అవకాశముంది.