Crime news in AP: నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. వరికుంటపాడు వద్ద పైవంతెన నుంచి కారు కిందపడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వరికుంటపాటు కోల్డ్ స్టోరేజ్ వద్ద వంతైన పైనుంచి కింద పడిన కారులో డ్రైవర్ సహా ముగ్గురు ఉన్నారు. ప్రమాదంలో పామూరుకు చెందిన వెంకటలక్ష్మమ్మ కారులోనే మృతిచెందారు. డ్రైవర్‌తో పాటు మరో యువతికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఉదయగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మూగబాలికపై అత్యాచారం..
కర్నూల్ జిల్లా కోడుమూరు మండలం పులకుర్తిలో దారుణం చోటు చేసుకుంది. మతిస్థిమితం లేని మూగ బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడో దుర్మార్గుడు. పులకుర్తి గ్రామానికి చెందిన బోయ మద్దిలేటి(40) అనే వ్యక్తి.. అదే గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని మూగ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చాక్లెట్ ఆశ చూపి.. బాలికను తన ఇంట్లోకి పిలిపించుకుని..దారుణానికి ఒడిగట్టాడు. అదే సమయంలో ఇంటికి వచ్చిన తండ్రికి కూతురు కనిపించకపోవటంతో.. గ్రామంలో వెతికాడు. మద్దిలేటి ఇంటివద్ద బాలిక సైకిల్ చూసిన తండ్రి.. అనుమానంతో అతని ఇంట్లోకి వెళ్లాడు. దీంతో కంగారుపడిన నిందితుడు.. ఇంటి నుంచి తప్పించుకున్నాడు. విషయం తెలుసుకున్న బాలిక తండ్రి.. కోడుమూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఆరేళ్ల బాలికపై యువకుడి అత్యాచారం
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం కాపవరం గ్రామంలో.. దారుణం జరిగింది. ఆరేళ్ల బాలికపై.. 19 ఏళ్ల యువకుడు.. అత్యాచారానికి పాల్పడ్డాడు. కపిలేశ్వరపురం మండలం నల్లూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి.. పనుల నిమిత్తం హైదరాబాద్ వెళుతూ.. తన భార్య, పిల్లలను.. కందులపాలెంలోని వారి పుట్టింటికి పంపించాడు. ఈ క్రమంలో.. బాలిక ఆడుకుంటుండగా.. నిందితుడు.. చిన్నారికి చిరుతిళ్లు కొనిపెడతానని మాయమాటలు చెప్పాడు. ద్విచక్రవాహనంపై తన ఇంటికి తీసుకువెళ్లి.. అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం.. నిందితుడే బాలికను తీసుకువచ్చి మార్గమధ్యలో వదిలేశాడు. గమనించిన చిన్నారి తల్లి, అమ్మమ్మ.. విషయాన్ని అర్థం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. బాలికను పరీక్షించిన వైద్యులు.. మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. నిందితుడిని అరెస్టు చేశారు.
మహిళపై అత్యాచారయత్నం
నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమనలో మహిళపై అత్యాచారయత్నం జరిగింది. దశయ్య అనే వ్యక్తి నాటుసారా సేవించి.. పొలం పనులకు వెళ్లివస్తున్న మహిళపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
కోరిక తీర్చాలంటూ వృద్ధ మహిళకు వేధింపులు
అనంతపురం జిల్లా గుంతకల్లులో రోజు రోజుకు మహిళలపై, కామాంధుల ఆగడాలు పెచ్చు మీరుతున్నాయి. రెండు రోజుల కిందట ఓ మహిళను వివస్త్రను చేసి, కరెంటు స్థంభానికి కట్టేసి చితకబాదిన ఘటన మరవకముందే.. ఓ వృద్ధ మహిళపై అత్యాచారం జరిగింది. వృద్దురాలి భర్త 15ఏళ్ల క్రితం మరణించగా.. బాధితురాలు ఒంటరిగా జీవనం సాగిస్తోంది. ఇంటి సమీపంలో ఉంటున్న చంద్ర అనే యువకుడు.. నిత్యం తనను వేధించేవాడని బాధితురాలు తెలిపారు. తన కోరిక తీర్చాలంటూ.. చితకబాదినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై సుమోటోగా 324, 509 సహా పలు కేసులు నమోదు చేేశారు.