కుటుంబ కలహాలతో కట్టుకున్న భార్యను కడతేర్చిన ఘటన శ్రీకాకుళం గ్రామీణ మండలం సానివాడలో చోటు చేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ ఘటన.. స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. విశాఖపట్నానికి చెందిన కల్యాణితో ఆరున్నర ఏళ్ల కిందట పొన్నాడ నవీన్ కుమార్ వివాహం జరిగింది. వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. మంగళవారం రాత్రి కూడా మరోసారి ఘర్షణ జరిగింది. ఆ సమయంలో క్షణికావేశానికి లోనైన నవీన్ కుమార్.. నిద్రపోతున్న కల్యాణిపై తలగడను పెట్టి ఊపిరి ఆడకుండా చేసి.. హత్య చేశాడు. అనంతరం శ్రీకాకుళం గ్రామీణ పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.
మహిళ దారుణ హత్య..
గుంటూరు జిల్లా బాపట్లలోని పెయింటర్స్ కాలనీకి చెందిన గుడపాటి భారతి దారుణ హత్యకు గురైంది. ఆమె గత నెల 16వ తేదీ నుంచి కనిపించకుండాపోయింది. దీనిపై కుటుంబ సభ్యులు బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హత్య కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
దంపతులపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..
కృష్ణా జిల్లా చాట్రాయి మండలంల చిత్తపూరు చెరువు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు దంపతులపై దాడికి దిగారు. స్ప్రే చల్లి ఈ దారుణానికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆ దంపతులను అటుగా వెళుతున్న కొందరు వ్యక్తులు నూజివీడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేయలేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యే కుమారుడికి రోడ్డుప్రమాదం..
తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం ఎదురులంక జాతీయ రహదారి 216పై ప్రమాదం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి కాకినాడ నుంచి అమలాపురం వస్తున్న కారు రోడ్డు ప్రక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీ కొట్టడంతో కారులో ఉన్న ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు.. వారిని ముమ్మడివరం శాసనసభ్యుడు పొన్నాడ సతీష్ కుమారుడు, మేనల్లుడుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే వారిని కాకినాడ అపోలో ఆసుపత్రికి తరలించారు. కుమారుడికి స్వల్ప గాయాలు కాగా మేనల్లుడు పరిస్థితి విషమంగా ఉంది.
గ్యాస్ సిలిండర్ లీక్‌తో అగ్నిప్రమాదం..