కర్నూలు జిల్లాలో జరిగిన మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఉలిందకొండ వద్ద జాతీయ రహదారిపై ఆగిఉన్న కంటైనర్‌ను కారు ఢీకొన్న ఘటనలో.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి కర్నూలు సర్వజన వైద్యశాలలో అనారోగ్యంతో ఉన్న బంధువును చూసేందుకు కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నందికొట్కూరు మండలం దామగట్ల క్రాస్ రోడ్ వద్ద జరిగిన ప్రమాదం మరో ఇద్దరిని బలితీసుకుంది.
డోన్ నుంచి బేతంచెర్లకు వెళ్లేందుకు ఒకే వరుస రహదారి ఉండేది. ఈ రహదారిలోనే ఖానిజాల మైనింగ్ లు ఉండడం, వందలాది పరిశ్రమలు ఉండడం, ప్రముఖ పుణ్యక్షేత్రమైన మద్దిలేటి స్వామి ఆలయం ఉండడంతో.. ఈ రహదారిపై రాకపోకలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో తరచూ భారీ ప్రమాదాలు జరుగుతున్నాయి.
వీధికుక్కపై కర్కశత్వం..
కర్నూలులో వీధికుక్కను కొందరు వ్యక్తులు దారుణంగా కొడుతున్న సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో స్పందించిన వెల్ఫేర్ ఆఫ్ యానిమల్ అండ్ లెబ్రేషన్ కర్నూలు సంస్థ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ టీవీ ఫూటేజ్ ప్రకారం ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని సీఐ పార్థసారథి రెడ్డి తెలిపారు. మున్సిపల్ సిబ్బందే అనాధికారికంగా ఇలా చేశారని ఫిర్యాదిదారుడు శివకుమార్ తెలిపారు.
అనంతపురంలో ప్రమాదవశాత్తు పేలిన గ్యాస్ సిలిండర్..
గ్యాస్ సిలిండర్ పేలి ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన.. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం బెస్తరపల్లిలో చోటుచేసుకుంది. పేలుడు ధాటికి ఇంటి గోడలు నేలమట్టమయ్యాయి. మంటల్లో చిక్కుకున్న ఇంటి యజమానిని స్థానికులు బయటకు తీసి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మిగిలిన కుటుంబ సభ్యులంతా కర్ణాటకలో ఓ పెళ్లి కార్యక్రమానికి వెళ్లటంతో పెను ప్రమాదం తప్పిందని గ్రామస్తులు అంటున్నారు. మూడు నెలల క్రితం కొత్తగా నిర్మించిన ఇంటిలో చెన్నరాయప్ప కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నట్లు వెల్లడించారు.
స్మగ్లర్లను తరలిస్తున్న బస్సును పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ అధికారులు..
తిరుపతి నుంచి తమిళనాడు తిరుపత్తూరుకు స్మగ్లర్లను తరలిస్తున్న బస్సును టాస్క్‌ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. అందులో ఉన్న 30 మంది స్మగ్లర్లు పరార్ కాగా.. డ్రైవర్ కండక్టర్ లను అదుపులోకి తీసుకుని చంద్రగిరి పోలీసులకు అప్పగించారు . బస్సులో స్మగ్లర్లు వదిలి వెళ్లిన బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. సంచుల్లో గొడ్డళ్లు, తినుబండారాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఫారెస్ట్ యాక్ట్ కింద డ్రైవర్, కండెక్టర్ పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ శ్రీనివాసులు వెల్లడించారు.
బాలికపై అత్యాచారయత్నం..
చిత్తూరు నగరం రోసీ నగర్లో ఎనిమిదేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. బాలిక తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు చిత్తూరు దిశ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలిక.. కాలనీ సమీపంలో బహిర్భూమికి వెళ్లింది. ఇదే సమయంలో కాలనీకి చెందిన నాగరాజు అనే వ్యక్తి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసులు తెలిపారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు నాగరాజును పోలీసులు అరెస్టు చేశారు.
మద్యం మత్తులో భార్యపై భర్త దాడి..
ఇంట్లో నిద్రిస్తున్న భార్యపై.. భర్త మద్యం మత్తులో కత్తితో దాడి చేసిన ఘటన నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం అత్తలపాలెంలో చోటుచేసుకుంది. తలపై పలు చోట్ల విచక్షణారహితంగా దాడి చేయడంతో.. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మూడు రోజుల క్రితం తనను కొట్టడంతో భర్తపై .. భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోపం పెంచుకున్న భర్త.. మద్యం తాగి.. నిద్రలో ఉన్న భార్యపై కత్తితో దాడి చేశాడు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..
విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పారాదిలో కలిశెట్టి వెంకటరమణ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. అతని మరణం పట్ల అనుమానంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహంపై ఉన్న గాయాల కారణంగా.. అతను హత్యకు గురైనట్లు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. వెంకటరమణ గుండెపోటుతో మృతి చెందినట్లు భార్య లలిత.. కుటుంబసభ్యులకు చెప్పిందని.. ఆమెపై అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించామని.. సమగ్ర దర్యాప్తు తర్వాత వివరాలు వెల్లడిస్తామన్నారు.