తెలంగాణ మద్యం ఆంధ్రాకు గుట్టుచప్పుడు కాకుండా వెళ్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో దశలవారీగా మద్యపానం నిషేధం అమలులో ఉండటంతో... మద్యం రేట్లు విపరీతంగా పెరిగాయి. ఇదే అదనుగా తెలంగాణ మద్యాన్ని కొంత మంది అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా తెలంగాణలోని నల్గొండ జిల్లా, దామరచర్ల మండలం వాడపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న శ్రవణ్‌కుమార్ అనే కానిస్టేబుల్... పోలీస్ పెట్రోలింగ్ వాహనంలో మద్యం కాటన్లను తరలిస్తుండగా(constable smuggling liquor from Telangana to AP) గుంటూరు జిల్లా దాచేపల్లి పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని కేసు నమోదు చేశారు.
ఏం జరిగింది?..
వాడపల్లి పీఎస్ పెట్రోలింగ్ వాహనం ఈ నెల 14న రాత్రి నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై తిరుగుతోంది. విధుల్లో ఉన్న శ్రవణ్‌కుమార్‌కు అర్ధరాత్రి దాటిన తర్వాత ఫోన్ వచ్చింది. మద్యం సీసా కాటన్లు గల వాహనం అతని వద్దకు రాగా అందులో ఉన్న సరకును వాడపల్లి సమీపంలో పెట్రోలింగ్ వాహనంలోకి పేర్చారు. పోలీసు వాహనం కావడంతో చెక్‌పోస్టు వద్ద అధికారులు తనిఖీ చేయలేదు. సరిహద్దు దాటి రామాపురం క్రాస్‌రోడ్ వద్ద మద్యం కాటన్లను వేరే వాహనంలో వేసి వస్తుండగా గుంటూరు జిల్లా దాచేపల్లి పోలీసులు స్వయంగా పట్టుకున్నారు. పెట్రోలింగ్ వాహనంతో పాటు, సదరు కానిస్టేబుల్ వెంట ఉన్న మద్యం నిల్వలను దాచేపల్లి పీఎస్‌కు(constable smuggling liquor at telangana) తరలించారు. ఈ కేసులో కానిస్టేబుల్ శ్రవణ్‌కుమార్‌ను రిమాండ్ చేయగా మరికొందరి ప్రమేయంపై విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనను నల్గొండ జిల్లా పోలీసు యంత్రాంగం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే శాఖాపరమైన దర్యాప్తునకు ఆదేశించనట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఒకట్రెండు రోజుల్లో ఇందులోని బాధ్యులందరిపై చర్యలుంటాయని సమాచారం.
పోలీసు వాహనమైతే ఎవరూ ఆపరని..
తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి ఏపీకి మద్యం చేరాలంటే సరిహద్దులో ఏపీ ఎక్సైజ్‌శాఖ చెక్‌పోస్టును దాటి వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సరిహద్దున ఉన్న పొందుగుల చెక్‌పోస్టు వద్ద వాహనాల తనిఖీ ఉండడంతో క్షేమంగా సరకు వెళ్లేందుకు ఏపీకి అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న ముఠా పోలీసుల వాహనాలను ఎంచుకున్నారు. ఇందుకు వాడపల్లి పీఎస్‌లో ఉన్న పెట్రోలింగ్ వాహనం అనువుగా ఉంటుందని భావించి ఆ మేరకు మాట్లాడుకున్నారు. అప్పటి నుంచి రాత్రి వేళ విధుల్లో ఉన్న వారు ఈ వాహనం ద్వారా సరకును సరిహద్దును దాటిస్తున్నారు. కొంతకాలంగా వాడపల్లి పీఎస్‌కు చెందిన పెట్రోలింగ్ వాహనం రాత్రివేళ తరచుగా సరిహద్దు దాటి వస్తుండటంతో గుంటూరు పోలీసులు అనుమానించారు. ఆ మేరకు దృష్టి పెట్టి పట్టుకున్నారు.