ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

CYBER CRIME: సైబర్‌ నేరాలపై.. గంటకో ఫిర్యాదు! - telangana 2021 news

తెలంగాణలో సైబర్ నేరాలపై గంటకో ఫిర్యాదు వస్తోందని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఖాతాలో డబ్బు పోయిన వెంటనే  ఫిర్యాదు చేస్తే ప్రయోజనం ఉంటుందన్నారు. అందులో భాగంగానే 155260 నంబర్‌కు విస్తృత ప్రచారం కల్పించాలని పోలీసుల నిర్ణయం తీసుకున్నారు.

cyber crime
cyber crime

By

Published : Aug 10, 2021, 8:30 AM IST

సైబర్‌ నేరాల బాధితులకు సాంత్వన చేకూర్చే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన జాతీయస్థాయి టోల్‌ఫ్రీ నంబర్‌ 155260కు మరింత ప్రచారం కల్పించాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇప్పటికే గంటకు ఒక ఫిర్యాదు చొప్పున వస్తుండగా ఈ సదుపాయంపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తే మరింత మంది బాధితులు ముందుకు వస్తారని భావిస్తున్నారు.

రాష్ట్రంలో ఇటీవల సంప్రదాయ నేరాలతో పోల్చితే సైబర్‌ నేరాల సంఖ్య శరవేగంగా పెరిగిపోతోంది. సైబర్‌ నేరం జరిగినప్పుడు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడం ఆలస్యమవుతోంది. ఈ లోపు బాధితుల ఖాతాల నుంచి బదిలీ అయిన డబ్బు ఖర్చయిపోతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని బాధితులకు సాంత్వన కలిగించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 155260 నంబర్‌ను ఏర్పాటు చేసింది. రాష్ట్రానికి సంబంధించి సైబరాబాద్‌ కమిషనరేట్‌ ద్వారా దీని కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఎవరైనా తమ ఖాతానుంచి డబ్బు పోయిందని ఫిర్యాదు చేయగానే 155260 నంబర్‌లో పనిచేస్తున్న వారు స్పందించి బాధితుడి బ్యాంకుఖాతా నంబరు వివరాలు తీసుకుని సదరు బ్యాంకును అప్రమత్తం చేస్తారు.

దీంతో బ్యాంకు అధికారులు బాధితుడి ఖాతా నుంచి బదిలీ అయిన నగదు తదుపరి లావాదేవీలన్నీ నిలిపివేస్తారు. అనంతరం పూర్తి వివరాలు సేకరించి సైబర్‌ నేరగాళ్లు కొట్టేసిన నగదును బాధితుల ఖాతాలో జమ చేసేలా చూస్తారు. ఇందులో పోలీసులు చేసే పని తమకు కాల్‌ రాగానే ఆ వివరాలను భారత రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘సిటిజన్‌ ఫైనాన్షియల్‌ సైబర్‌ ఫ్రాడ్‌ రిపోర్టింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం’కు బదిలీ చేయడమే. దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలను భాగస్వామ్యం చేస్తూ ఏర్పాటు చేసిన ఈ విధానం ద్వారా మోసపూరిత లావాదేవీలను తక్షణమే నిలిపివేస్తారు. ఇది విజయవంతం కావడంతో దీనికి మరింత ప్రచారం కల్పించాలని అధికారులు నిర్ణయించారు.

ఇదీ చూడండి:

సైకిల్​ను ఢీ కొట్టిన ట్రాక్టర్​.. పదేళ్ల బాలుడు మృతి

ABOUT THE AUTHOR

...view details