WOMAN SUICIDE IN SHAR : దేశానికే తలమానికమైన భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్)లో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఇంతటి కీలకమైన కేంద్రంలో 24 గంటల వ్యవధిలో కానిస్టేబుల్, ఎస్సై ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా శ్రీహరికోటలో మరో విషాదం చోటుచేసుకుంది. సీఐఎస్‌ఎఫ్ ఎస్సై వికాస్‌సింగ్ సతీమణి ప్రియాసింగ్(27) ఆత్మహత్య చేసుకున్నారు. నర్మద గెస్ట్ హౌస్‌లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. నిన్న తుపాకీతో కాల్చుకొని వికాస్‌సింగ్ ఆత్మహత్య చేసుకున్నారు. భర్త మృతి చెందిన సమాచారాన్ని ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉంటున్న వారి కుటుంబసభ్యులకు స్థానిక సీఎస్‌ఎఫ్ అధికారులు తెలియజేశారు. మంగళవారం తన అన్న, పిల్లలతో కలిసి శ్రీహరికోటకు చేరుకున్నారు. భర్త మృతదేహం వద్ద కన్నీటిపర్యంతమయ్యారు.
మంగళవారం శ్రీహరికోటలోని నర్మద అతిథి భవన్‌లో ఆమె బస చేశారు. వికాస్ సింగ్ మృతిపై స్థానిక పోలీసులు రాత్రి ప్రియాసింగ్‌ను విచారించారు. అనంతరం అతిథి భవనంలో బంధువులతో కలిసి అక్కడే ఉన్నారు. బుధవారం తెల్లవారుజామున ఆమె గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే సీఐఎస్‌ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు. ఇద్దరు మృతదేహాలను శ్రీహరికోట నుంచి పోస్టుమార్టం నిమిత్తం సూళ్లూరుపేట సర్వజన ఆసుపత్రికి తరలించారు. భర్త మరణాన్ని తట్టుకోలేకే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
సబ్ ఇన్‌స్పెక్టర్ వికాస్ సింగ్, ప్రియాసింగ్ దంపతులకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో కుమారుడు ఒకటో తరగతి, కుమార్తె ఎల్‌కేజీ, మరో కుమార్తె చిన్నపాప. ఇందులో ఓ కుమార్తె వికలాంగురాలు. ఇతని మృతిపైనా అనుమానాలున్నాయి. 2015 బ్యాచ్‌కు చెందిన ఇతను శిక్షణానంతరం ముంబయిలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌లో విధులు నిర్వహిస్తూ.. గతేడాది నవంబరులో బదిలీపై వచ్చారు. ముంబయిలో విధులు నిర్వహిస్తున్న సమయంలో క్రమశిక్షణ చర్యలకు గురైనట్లు తెలిసింది.
SUICIDES IN SHAR : అసలు షార్‌లో ఏం జరుగుతోంది: దేశానికే తలమానికమైన భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. కేంద్రాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఇక్కడి కేంద్ర పారిశ్రామిక భద్రత దళాలు రక్షణ కవచంగా ఉంటాయి. ఇంతటి కీలకమైన కేంద్రంలో 24 గంటల వ్యవధిలో కానిస్టేబుల్, ఎస్సై ఆత్మహత్యకు పాల్పడ్డారు. గతంలో ఇదే తరహాలో మరో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలున్నాయి. ఎంతో ప్రశాంతమైన షార్‌లో సిబ్బంది ఆత్మహత్యలపై భిన్న వాదనలు ఉన్నాయి.