Love Life Natural and Healthcare Cheating : సాంకేతికత పెరుగుతున్న తరుణంలో సైబర్ క్రైం మోసాలు పెచ్చుమీరుతున్నాయి. విద్యార్థి నుంచి ఉన్నత స్థాయిలో ఉద్యోగం చేసే వ్యక్తి వరకు ఈ సైబర్ ఉచ్చులో చిక్కుకొని విలవిలలాడిన ఉదంతాలు ఇప్పటికే చూశాం. తాజాగా విజయవాడలో మరో ఆన్‌లైన్ మోసం వెలుగు చూసింది. లవ్ లైఫ్ నేచురల్ అండ్ హెల్త్ కేర్ పేరుతో ప్రారంభమైన ఈ ఆన్‌లైన్ వ్యాపారం బాధితులకు కుచ్చుటోపీ పెట్టింది. మెుదట యాప్‌ని ప్రారంభించిన నిర్వాహకులు అనంతరం యాప్‌ని... లవ్ లైఫ్ నేచురల్ అండ్ హెల్త్ కేర్ పేరుతో వెబ్ పేజ్‌గా మార్చారు. ఈ ఘరానా సైబర్ మోసాన్ని నిర్వాహకులు పకడ్బందీగా చేశారు. ఈ వెబ్ పేజ్ లో ఉండే వైద్య పరికరాలపై పెట్టుబడి పెడితే వాటి ద్వారా రోజూ వారికి డబ్బు వస్తుందని బాధితులను నమ్మించారు. ఈ విషయంలో సఫలీకృతమైన నిర్వాహకులు కస్టమర్లను ఒక చైన్ పద్దతిలో తయారుచేశారు.
రూ.3వేల నుంచి 3 లక్షల వరకు పెట్టుబడి..
ఎవరైనా మెుదట ఒక మెడికల్ పరికరం కొనుగోలు చేస్తే ఆయన పేరు మీద ఆ పరికరం రిజిస్టర్ చేస్తారు. వాటిని యాప్ వారే ఇతరులకు అద్దెకు ఇచ్చి.. వస్తువు కొన్నవారికి రోజూ అద్దె చెల్లిస్తారు. మొదట్లో చాలా మంది చిన్న ఉత్పత్తులు కొనుగోలు చేశారు. 20 రోజుల్లోనే పెట్టుబడి వచ్చేయడంతో ఆకర్షితులయ్యారు. అలా వంటింటి గృహిణి నుంచి ఉద్యోగుల వరకు అందరూ పెట్టుబడి పెట్టారు. మూడు రోజుల క్రితం నుంచి నిర్వాహకులు ఫోన్లు స్విచ్ఛాప్ రావటంతో మోసపోయామని బాధితులు గ్రహించి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక్కో బాధితుడు కనీసం రూ.3వేల నుంచి 3 లక్షల వరకు పెట్టుబడి పెట్టినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.