దొంగలించిన ఆధార్ కార్డుతో అద్దెకు తీసుకుంటాడు.. అమ్మేస్తాడు హైదరాబాద్‌లో ఓ వ్యక్తి వినూత్న తరహాలో మోసాలకు పాల్పడుతున్నాడు. షేర్రూమ్ అనే మొబైల్ అప్లికేషన్ ద్వారా లాడ్జీలో గది తీసుకుంటాడు. తోటి వ్యక్తితో మాటామంతీ కలుపుతాడు. అదును చూసి అతని ఆధార్ కార్డుతో పాటు నగదు దోచుకెళ్తాడు. ఆధార్ కార్డును చూపించి ఖరీదైన కార్లను అద్దెకు తీసుకుంటున్నాడు. అనంతరం వాటిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాడు.
యజమాని కన్నుగప్పి..
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సీసలికి చెందిన మహేశ్ కుమార్ 2016లో బీటెక్ పూర్తి చేశాడు. భీమవరంలోని ఓ మొబైల్ దుకాణంలో మెకానిక్‌గా పని చేశాడు. కొన్ని నెలల తర్వాత హైదరాబాద్‌కు మకాం మార్చిన మహేశ్... మలక్‌పేట్‌లోని మొబైల్ దుకాణంలో పనిలో చేరాడు. యజమాని కన్నుగప్పి చరవాణులు, డబ్బులు దొంగిలించడంతో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇలా వివిధ కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చినా తీరు మార్చుకోలేదు.
జీపీఎస్ తొలగించి..
2019లో ఎస్ఆర్నగర్లో మహేశ్ అద్దెకు దిగాడు. కారు, లాప్‌టాప్ దొంగతనం కేసులో అరెస్ట్ అయ్యాడు. జైలు నుంచి బయటికు వచ్చిన తర్వాత నేరాల తీరును మార్చాడు. చరవాణిలో షేర్యాప్ ద్వారా లాడ్జ్ తీసుకొని..తోటి వ్యక్తి కార్డులతో పాటు నగదు దోచుకెళ్లటం ప్రారంభించాడు. ఇలా ఎత్తుకెళ్లిన ఆధార్ కార్డులతో కార్లను అద్దెకు తీసుకొని.. వాటి జీపీఎస్ తొలగించి వాహనాలు అమ్ముకొని డబ్బు సంపాదించాడు. హైదరాబాద్, బెంగళూర్, పుణె, వైజాగ్‌లో ఇలాంటి చోరీలకు పాల్పడ్డాడు. మాదాపూర్‌లో దొంగిలించిన జూమ్ కారు కేసులో పోలీసులకు పట్టుబడటంతో నిందితుడి మోసాలు వెలుగుచాశాయి. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆరు కార్లు, ఓ ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి నయా మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఇవీ చూడండి:
టీకా పంపిణీలో అసమానత్వంపై డబ్ల్యూహెచ్‌ఓ ఆందోళన