కుటుంబ సమస్యలు తట్టుకోలేకపోయారో, ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయో, మానసిక ఒత్తిడికి తలొగ్గారో, ఏమైందో ఏమోగాని.. అక్కా, తమ్ముడు బలవన్మరణానికి పాల్పడ్డారు. కన్నపిల్లలు విగతజీవులుగా పడి ఉండడాన్ని చూసిన ఆ తల్లి మనసు తల్లడిల్లిపోయింది. ఇక తాను ఎవరికోసం బతకాలంటూ ఆమె గుండెలవిసేలా రోదించారు. అన్నవరంలో చోటు చేసుకున్న ఈ ఘటన అందర్నీ కంటతడి పెట్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..తొండంగి మండలం గోపాలపట్నం గ్రామానికి చెందిన పోకల శ్రీదేవి (22), ఆమె తమ్ముడు (17).. తల్లితో కలిసి అన్నవరంలోని కుమ్మరివీధిలో నివాసం ఉంటున్నారు. వీరి తల్లి సూర్యకుమారి స్థానికంగా ఓ బ్యాంకులో పనిచేస్తున్నారు. తండ్రి పూర్ణచంద్రరావు హైదరాబాద్‌లో ఉంటూ సెంట్రింగ్ మేస్త్రీగా పనిచేస్తున్నారు. క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో శనివారం రాత్రి తల్లి చర్చికి వెళ్లారు. ఇంట్లో ఆమెలేని సమయంలో అక్కాతమ్ముళ్లిద్దరూ చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆదివారం ఉదయం సూర్యకుమారి ఇంటికి వచ్చేసరికి తలుపు లోపలి గడియ వేసి ఉంది. ఎంతపిలిచినా తలుపు తీయకపోవడంతో, స్థానికుల సాయంతో తలుపుతెరిచి చూడగా ఇంట్లో ఇద్దరూ విగతజీవులుగా పడి ఉండటంతో ఆమె తట్టుకోలేకపోయారు. కుమార్తె, కుమారుడు మృతదేహాలను హత్తుకుని గుండెలవిసేలా రోదించారు. శ్రీదేవి వివాహ జీవితంలో ఇబ్బందులు ఉన్నాయని తెలిసింది. ఆమె తమ్ముడు ప్రస్తుతం ఇంటివద్దనే ఉంటున్నట్లు సమాచారం. తల్లికూడా కొద్ది రోజులుగా విధులకు వెళ్లకపోవడం, తండ్రి సంపాదన సరిపోకపోవడంతోనూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని సమాచారం. మానసికంగా వీరు వేదనకు గురవ్వడంతో పలు సందర్భాల్లో స్థానికులు కూడా కౌన్సెలింగ్ ఇచ్చారని తెలిసింది. ఎస్సై శోభన్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేశారు.
అన్నవరంలో విషాదం.. ఉరేసుకుని అక్క, తమ్ముడు ఆత్మహత్య - నేర వార్తలు
suicide
15:37 December 25
ఆర్థిక ఇబ్బందులే కారణమని అనుమానం
అలా రాసింది ఎవరు..?
‘చావు’ అని ఒకేఒక్క పదం రాసిన చిన్న కాగితం ఇంట్లో ఉందని తెలిసింది. దీన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బలవన్మరణానికి పాల్పడిన అక్క, తమ్ముడిలో ఈ పదం రాసింది ఎవరు? ఎందుకు ఇలా రాశారు? మానసికంగా ఇబ్బంది పడుతూ ఈ నిర్ణయానికి వచ్చారా..తదితర కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి:
Last Updated : Dec 26, 2022, 11:32 AM IST