DIED:పచ్చని పందిళ్లు.. బంధుమిత్రుల సందళ్లు.. కల్యాణ కాంతులు పరచుకున్న వేళ ఒక్కసారిగా కలకలం.. కొత్త జీవితంలో అడుగు పెట్టడానికి సప్తపదుల దూరంలో ఉన్న జంటలో వధువు స్పృహ తప్పి వేదికపైనే కుప్పకూలింది. ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోవడంతో పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది. విశాఖలోని మధురవాడలో బుధవారం రాత్రి జరిగిన వివాహ వేడుకలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
పెళ్లిలో విషాదం.. జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో కుప్పకూలిన వధువు - విశాఖ జిల్లా తాజా వార్తలు
13:08 May 12
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పెళ్లికుమార్తె సృజన మృతి
పి.ఎం.పాలెం పోలీసులు తెలిపిన వివరాలివి. హైదరాబాద్‌కు చెందిన ఎం.ఈశ్వరరావు, అనూరాధల కుమార్తె సృజనకు (22) విశాఖ పి.ఎం.పాలెంకు చెందిన నాగోతి అప్పలరాజు, లలితల కుమారుడు.. టీఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివాజీతో పెళ్లి నిశ్చయమైంది. బుధవారం రాత్రి పదింటికి ముహూర్తంగా నిర్ణయించారు. సాయంత్రం విందులో వధూవరులిద్దరూ హుషారుగా అతిథులకు స్వాగతం పలికారు. వారి ఆశీర్వాదాన్ని పొందారు. పెళ్లి పీటలపై కూర్చున్నారు. వరుడు వధువు తలపై జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో పెళ్లి కుమార్తె సృజన కుప్పకూలారు. కుటుంబీకులు, బంధువులు ఆమెకు సపర్యలు చేసి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించడంతో విషాదఛాయలు అలముకున్నాయి.
సృజన బుధవారం ఉదయం కాస్త నీరసంగా ఉండటంతో కుటుంబీకులు తొలుత చికిత్స చేయించారు. మరణానికి అనారోగ్యమా? ఆత్మహత్యా? ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఇంకా గుర్తించని విషం (అన్‌నోన్ పాయిజన్) వల్లే యువతి మృతి చెంది ఉంటుందని వైద్యులు ప్రాథమిక అంచనాకు వచ్చారని పోలీసులు తెలిపారు. వధువు చేతి సంచిలో గన్నేరు పొట్లాన్ని వారు గుర్తించారు. దీనిపై విచారిస్తున్నామని, పోస్టుమార్టం నివేదిక వచ్చేవరకు ఏదీ నిర్ధారించలేమని ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు.
ఇవీ చదవండి: Rape Attempt: బాలికపై అత్యాచారయత్నం... కేకలు వేయడంతో..!