ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

ప్రాణం తీసిన పబ్జీ.. ఆటలో ఓడిపోయానని దారుణ నిర్ణయం..! - కృష్ణా జిల్లా తాజా వార్తలు

pub g
pub g

By

Published : Jun 12, 2022, 3:03 PM IST

Updated : Jun 12, 2022, 4:59 PM IST

14:59 June 12

శారీరక దారుఢ్యానికి మేలు చేయాల్సిన ఆటలు.. ఊబకాయానికి బాటలు వేస్తున్నాయి..!! మానసిక ఉల్లాసానికి దోహదం చేయాల్సిన గేమ్స్.. మానసిక వైఫల్యానికి బాటలు వేస్తున్నాయి..!!విశాలమైన మైదానాల్లో పది మంది కలిసి ఉత్సాహంగా ఆడాల్సిన ఆటలను.. నాలుగు గోడల మధ్య ఒంటరిగా సెల్ ఫోన్లలో ఆడేస్తున్నారు..! కోచ్ అవసరం లేదు.. ఫిజియోతో పనే లేదు.. తోడుగా సహచరుడు కూడా కనిపించడు.. రాక్షస చిత్రాల మాటున సాగిపోయే ఈ దారుణ క్రీడలో.. అంతిమ విజేతలెవ్వరూ ఉండకపోవడమే మొబైల్ గేమ్​లోని అసలు ట్విస్ట్!

డిప్రెషన్.. బుద్ధిమాంద్యం.. విచిత్ర ప్రవర్తన.. వంటి మానసిక రోగాలే బహుమతులుగా నిర్ణయించబడిన ఈ మొబైల్ గేమ్స్​లో.. ఆత్మహత్య చేసుకోవడమే ఫస్ట్ ప్రైజ్! ఇలాంటి రాక్షస క్రీడల్లో ప్రథమ స్థానంలో ఉన్న పబ్జీ గేమ్​కు.. మరో పసివాడు బలైపోయాడు..! కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జరిగిన ఈ దారుణ సంఘటన.. కుటుంబంలో తీరని విషాదం నింపితే.. స్థానికంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది..

కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని హౌసింగ్ బోర్డుకు చెందిన ఊటుకూరు ప్రభు అనే 16 సంవత్సరాల బాలుడికి ఫోన్​లో పబ్జీ ఆడటం అలవాటు. రోజూలాగే పబ్జీ గేమ్ ఆడాడు. అయితే.. ఈసారి గేమ్​లో ప్రభు ఓడిపోయాడు. దీంతో.. ఓడిపోయాడని తోటి స్నేహితులు అపహాస్యం చేశారు. గెలుపు మంత్రాన్ని మాత్రమే జపించే ఈ సమాజంలో.. ఓడిపోయిన వాడికి చోటే లేదని భావించాడు ఆ బాలుడు..! భ్రమకు, వాస్తవానికి తేడా తెలియని వయసులో.. ఓటమి బాధను జీర్ణించుకోలేక బలవంతంగా ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

తన ఇంట్లోనే ఫ్యాన్​కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఊహించని కుమారుడి చర్యతో ఆ కుటుంబం అంతులేని విషాదంలో మునిగిపోయింది. ఆనందం పంచాల్సిన ఆట.. ఆ కుటుంబంలో విషం చిమ్మడంతో తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితి ఏ ఇంటా రావొద్దని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభు మృతిపట్ల కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తాంతియా కుమారి విచారం వ్యక్తం చేశారు. పబ్జీ గేమ్ వల్ల ఎంతో మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, బాలుడు ప్రభు మృతి అందరికీ ఓ కనువిప్పు కావాలని అన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 12, 2022, 4:59 PM IST

ABOUT THE AUTHOR

...view details