చిత్తూరు జిల్లా కలికిరి బ్యాంక్ ఆఫ్ బరోడాలో జరిగిన అక్రమాలపై విచారిస్తున్న అధికారులకు విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. వాల్మీకిపురం సీఐ నాగార్జునరెడ్డి, ఎస్‌ఐ లోకేష్‌రెడ్డి, వెలుగు ప్రాంతీయ సమన్వయకర్త రూతు, ఏపీఎం సుబ్రహ్మణ్యం, సీసీలతో కలిసి బ్యాంకులో శనివారం దర్యాప్తు చేశారు. బ్యాంకు మెసెంజరు అలీఖాన్ వారికి పలు విషయాలు వెల్లడించారు. ప్రధానంగా శివలీల, ఓంశక్తి, చౌడేశ్వరి, గౌసియా, గణపతి, అలమతర, మక్కా ఎస్‌హెచ్‌జీ సంఘాలకు చెందిన రూ.76 లక్షల రుణాల సొమ్ముకు.. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కాజేసినట్లు అంగీకరించాడు.
భార్యకు బంగారు నగలు కొనిచ్ఛా.. అక్కా, చెల్లెలకు పెళ్లి చేశా..
ఈ నగదును బ్యాంకు సిబ్బందితో వాటాలు పంచుకున్నట్లు తెలిపారు. కాజేసిన నగదును ఏం చేశావని ప్రశ్నించగా... ‘ఇల్లు కట్టుకుని పెళ్లి చేసుకున్నా. భార్యకు బంగారు నగలు కొనిచ్ఛా అక్కా, చెల్లెలకు పెళ్లి చేశా’ అని అతను వెల్లడించినట్లు సీఐ వివరించారు. ఐదారేళ్లుగా బ్యాంకు మేనేజరు కనుసన్నల్లోనే వ్యవహారం జరిగిందని, సబ్ మేనేజరు, క్లర్కులు, సిబ్బంది వాటాలు పంచుకున్నట్లు గుర్తించామన్నారు. మేడికుర్తికి చెందిన గౌసియా డ్వాక్రా సంఘం సభ్యులు వ్యక్తిగత కారణాలతో కొన్నేళ్ల కిందట సంఘాన్ని రద్దు చేసుకోవడంతో దానికి నకిలీ డాక్యుమెంట్‌తో రూ.8,57,787 రుణం మంజూరు చేశారన్నారు.