rape attempt in krishna district: ఆటోలో ఒంటరిగా వెళ్తున్న మహిళ వద్ద ఉన్న నగదు దోచుకొని.. అత్యాచారయత్నం చేయబోయాడు డ్రైవర్. మహిళ ప్రతిఘటించి.. తప్పించుకునేందుకు యత్నించగా ఆమెను తోసేసి పరారయ్యాడు ఈ ఘటన కృష్ణాజిల్లా పామర్రులో చోటు చేసుకుంది. పామర్రు మండలం పెద్దమద్దాలికి చెందిన ఆమీనా సుల్తానా అదే గ్రామానికి చెందిన రత్తయ్య అనే వ్యక్తి ఆటోలో కంకిపాడు నుండి తన గ్రామానికి బయలుదేరింది. మార్గమధ్యంలో బల్లిపర్రు గ్రామం వద్ద ఆటోను దారి మార్చి పొలాల్లోకి తీసుకెళ్ళాడు. ఆమె వద్ద ఉన్న నగదు ఇవ్వాలని బెదిరించాడు. ఎందుకివ్వాలని ఆమె ప్రతిఘటించగా కత్తితో దాడి చేసి బలవంతంగా నగదు లాక్కొని, అత్యాచారం చేయబోయాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో పక్కనే ఉన్న కాలువలోకి తోసేసి అతను అక్కడి నుంచి పరారయ్యాడని ఆమె తెలిపింది.
అక్కడినుంచి తప్పించుకుని హైవే మీదకు వచ్చి కుటుంబ సభ్యులకు, 108కు సమాచారం అందించినట్లు ఆమె చెప్పింది. గాయపడిన సుల్తానాను గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు. కేసు నమోదు చేసిన పామర్రు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.