విశాఖలో శనివారం యువతిపై పెట్రోల్‌పోసి నిప్పంటించి.. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన ఉదంతంలో యువకుడే ప్రధాన నిందితుడని పోలీసులు తేల్చారు. యువతిని హత్య చేయాలన్న ఉద్దేశంతోనే వ్యూహం ప్రకారం విశాఖ వచ్చినట్లు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఆదివారం తెలిపారు. పోలీసులు చెప్పిన వివరాలివి.
విశాఖ నగరానికి చెందిన యువతికి తెలంగాణలోని భూపాలపల్లికి చెందిన పలకల హర్షవర్థన్‌రెడ్డి(21)తో పరిచయం ఏర్పడింది. ఇటీవల ఆ యువతికి తన ప్రేమను తెలపగా ఆమె తిరస్కరించింది. దీంతో ఆమెపై శనివారం పెట్రోల్ పోసి నిప్పంటించి తాను కూడా చనిపోవడానికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వారిద్దరి పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ కేసును దిశా పోలీసుస్టేషన్‌కు బదిలీ చేశారు. నిందితుడిపై హత్యాయత్నంపాటు ఆత్మహత్యాయత్నం కేసులను నమోదు చేశారు. అలాగే పెట్రోలు పోసి నిప్పంటించడానికి ముందు తనతో తీవ్ర అభ్యంతరకరంగా ప్రవర్తించినట్లు ఆ యువతి ఆదివారం ఉదయం పోలీసులకు చెప్పడంతో.. హర్షవర్థన్ రెడ్డిపై లైంగిక వేధింపుల సెక్షన్లను కూడా జోడించారు.
దర్యాప్తు వేగవంతం..
ఘటన అనంతరం హోటల్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన నిఘా కెమెరాల్లో నిక్షిప్తమైన సీసీఫుటేజీని పోలీసులు పరిశీలించారు. పెట్రోల్‌ను ఎక్కడి నుంచి కొనుగోలు చేశాడు? ఎంత పరిమాణంలో కొనుగోలుచేశాడన్న విషయంపైనా ఆరా తీస్తున్నారు. యువతీ, యువకుల ఫోన్ నెంబర్ల ఆధారంగా వారి మిత్రులతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు. వారి నుంచి కూడా కీలక సమాచారం వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. యువతి జీన్ ఫ్యాంట్ ధరించి ఉండడంతో నడుము నుంచి కాళ్ల వరకు పెద్దగా గాయాలు కాలేదు. కానీ.. నడుము నుంచి పై వరకు మాత్రం తీవ్రంగా కాలిపోయింది. యువకుడు హర్షవర్థన్ రెడ్డి ముఖం నుంచి కాళ్ల వరకు తీవ్రంగా గాయపడ్డాడు.