Attempt To Murder: నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ప్రేమ వ్యవహారం హత్యాయత్నానికి దారి తీసింది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న నజీర్, ఓ యువతి మధ్య కొద్ది నెలలుగా ప్రేమ వ్యవహారం సాగుతోంది. అయితే ఆమె తల్లిదండ్రులు ప్రేమ వ్యవహారాన్ని ఒప్పుకోలేదు. కావలికి చెందిన మరో వ్యక్తితో ఆమె పెళ్లి నిశ్చయించారు. పెళ్లి ఇష్టం లేని ఆ యువతి.. తన ప్రేమ వ్యవహారాన్ని పెళ్లికొడుకుకు చెప్పింది. ఆ తర్వాతే అసలైన ట్విస్ట్ జరిగింది.
మాట్లాడదామని నజీర్‌ను ఓ దగ్గరకు పిలిపించారు. అతని వద్ద ఉన్న కాల్ రికార్డు, ఫోటోలు డిలీట్ చేయించారు. ఆ తర్వాత నజీర్ స్కూటీపై వెళ్తుండగా కారుతో వేగంగా ఢీకొట్టారు. దీంతో నజీర్‌కు తీవ్ర గాయాలు కాగా అతనిని ఆసుపత్రికి తరలించారు. నజీర్ని కారుతో ఢీకొట్టిన ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు.