మహిళపై సామూహిక అత్యాచారం:పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో గుర్తుతెలియని మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. రైల్వేస్టేషన్లో తీవ్ర రక్తస్రావంతో పడివున్న మహిళను స్థానికులు చూసి స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మహిళ పక్కనే రెండేళ్ల బాబు ఉన్నాడని స్థానికుల తెలిపారు. మహిళ బాగా నీరసంగా ఉండడంతో ఎలాంటి వివరాలు చెప్పలేక పోతుందని వైద్యురాలు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు మాత్రం తనపై అత్యాచారం చేసినట్లు చెబుతోందని తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామన్నారు.
విశాఖ జిల్లాలో...
పుష్కరిణిలో స్నానానికి వెళ్లి: విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న వరాహ పుష్కరిణి వద్ద విషాదం చోటు చేసుకుంది. పుష్కరిణిలో స్నానం చేస్తూ మోహన్‌రావు అనే వ్యక్తి మృతి చెందాడు.
గుంతలో స్నానానికి దిగి ఇద్దరు విద్యార్థులు మృతి: విశాఖలో విషాదం చోటు చేసుకుంది. మేఘాద్రి గడ్డ రిజర్వాయర్ పక్కన ఓ గుంతలో స్నానానికి దిగి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. కంచరపాలెం, గోపాలపట్నంకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు మేఘాద్రి గడ్డ రిజర్వాయర్ పక్కన ఉన్న ఒక గుంతలో స్నానానికి దిగారు. వీరిలో ఇద్దరు విద్యార్థులు ఊబిలో చిక్కుకుని గోపాలపట్నం ప్రాంతానికి చెందిన లోహిత్ (14), కంచరపాలానికి చెందిన తరుణ్(18) ప్రాణాలు కోల్పోయారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పెద్దమ్మ గొంతు కోసిన కుమారులు: నెల్లూరు జిల్లా కోవూరు మండలం వేగూరులో దారుణం జరిగింది. కుటుంబకలహాలతో తండ్రి మొదటి భార్యను రెండో భార్య కుమారులు గొంతు కోసి హత్య చేశారు. పెద్దమ్మ గొంతు కోసిన ఇద్దరు కుమారులు పారిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
విజయనగరం జిల్లాలో....
రెండు బైకులు ఢీ... ఇద్దరు మృతి: విజయనగరం జిల్లా గంట్యాడలో రోడ్డు ప్రమాదం జరిగింది. విజయనగరంలోని మిత్రుని వివాహానికి వచ్చి వెళ్తుండగా గంట్యాడ వద్ద ఘటన రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో ఒకరు గంట్యాడ మండలం కొర్లాం వాసి రామకృష్ణగా, మరొకరు గుంటూరుకు చెందిన రామచంద్రారెడ్డిగా పోలీసులు గుర్తించారు.
దీపపు నిప్పు అంటుకుని... పూరిళ్లు దగ్ధం: విజయనగరంజిల్లా గజపతినగరం మండలం పిడిశాల గ్రామంలో తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ పురిళ్లు కాలిపోయింది. కుటుంబ సభ్యులు ఆరుబయట నిద్రించడంతో ప్రాణప్రాయం తప్పింది. ఇంట్లోని దీపం అంటుకుని అగ్నిప్రమాదం చోటు చేసుకున్నట్లు బాధితులు తెలిపారు. పక్కనే ఉన్న గ్యాస్ సిలిండర్‌కు మంటలు వ్యాపించటంతో సిలిండర్ పేలిపోయింది. పురిళ్లు పూర్తిగా దగ్ధమైంది. సిలిండర్ పేలిన శబ్ధానికి చుట్టుపక్కల వారు నిద్రలేచి మంటలను ఆదుపుచేసే ప్రయత్నం చేసినప్పటికీ... పెద్దఎత్తున ఎగిసిపడిన అగ్నికీలలకు పూరిళ్లు బూడదయిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.రెండు లక్షల ఆస్తి నష్టం సంభవించిందని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.
యువకుడి దారుణ హత్య:ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం గొట్లగట్టు వద్ద యువకుడు దారుణ హత్యకు గురయ్యారు. గొట్లగట్టు బస్టాండ్ కూడలిలో ఓ యువకుడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. హత్యకు గురైన వ్యక్తి బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్న హరిబాబుగా పోలీసులు గుర్తించారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. మృతుడు హనుమంతునిపాడు మండలం దొడ్డచింతల వాసిగా తెలిపారు.
వ్యక్తి దారుణ హత్య:అనంతపురం బుక్కరాయసముద్రం మండలం అనంతసాగర్ కాలనీలో దారుణం జరిగింది. చెరువు కట్టపై కుమార్ అనే వ్యక్తిని దుండగులు కత్తితో పొడిచి హత్య చేశారు.
తిరుపతి జిల్లాలో...
కారు బోల్తా... ఒకరు మృతి: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పూతలపట్టు-నాయుడుపేట రహదారిపై ముంగిలిపట్టు వద్ద కారు బోల్తా పడి ఒకరు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. తిరుపతి నుంచి చిత్తూరు వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
ఆలయంలో అపహరణ: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కోట గ్రామంలో దొంగల హల్‌చల్ చేశారు. గేటు తాళాలు పగలగొట్టి ముత్యాలమ్మ ఆలయంలోకి చొరబడిన దుండగులు...నగదు, సౌండ్ సిస్టమ్‌ను ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా చంద్రగిరి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈతకు వెళ్లి... విద్యార్థి మృతి: తిరుపతి జిల్లా చంద్రగిరిలో విషాదం చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు బావిలోకి దిగిన విద్యార్థి నీటిలో మునిగిపోయి మృతి చెందాడు. ధర్మవరం సమీపంలోని ఎల్సీకే పురానికి చెందిన హరికృష్ణ తిరుపతిలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ సెకెండ్ ఇయర్ చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి చంద్రగిరి జాతీయ రహదారి పక్కన ఉన్న వ్యవసాయ బావిలోకి ఈత నేర్చుకోవడానికి దిగిన హరికృష్ణ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. స్నేహితులు చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు... గజ ఈతగాళ్లతో మృతదేహాన్ని వెలికితీయించారు. పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కాలేజీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులమని చెప్పి... రూ.20 అపహరణ: తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పెన్నేపల్లి వద్ద జాతీయ రహదారిపై ఓ వ్యక్తి నుంచి ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు రూ.20 వేలు అపహరించారు. మండలంలోని దిగువ చావాలి గ్రామానికి చెందిన వెంకటరమణయ్య అనే వ్యక్తి నాయుడుపేట కూరగాయల మార్కెట్ నుంచి సరుకులు తీసుకుని వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు బైకుపై వెనుక నుంచి వచ్చి అయన్ను ఆపి... బస్తాలో హాన్స్ ప్యాకెట్లు ఉన్నాయని చూడాలని పోలీసుల పేరుతో తనఖీ చేశారు. డబ్బులు బయటకు తీయాలన్నారు. తిరిగి అంతా బస్తాలో పెట్టినట్లుగా పెట్టి చోరీ చేశారు. బాధితుడు ఇంటికెళ్లి చూడగా బస్తాలో నగదు లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి: విజయవాడలోని కొత్తపేట టుటౌన్ పోలీస్టేషన్ పరిధిలో కానిస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో పోలీస్ క్వార్టర్స్‌లో నివాసముంటున్న కానిస్టేబుల్ ఫ్లాట్ పై నుంచి కిందకు దూకడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు వన్ టౌన్ ట్రాఫిక్ పోలీస్టేషన్లో విధులు నిర్వహించే సొంటి వీరబాబుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పొలాల్లోకి దూసుకెళ్లిన పెట్రోల్ ట్యాంకర్:బాపట్ల జిల్లా అద్దంకి పట్టణ సమీపంలోని తిమ్మాయపాలెం వద్ద పెట్రోల్ ట్యాంకర్ ప్రమాదవశాత్తు పొలాల్లోకి దూసుకెళ్లింది. ట్యాంకర్‌లోని పెట్రోల్ లీక్ అవడంతో అగ్నిమాపక శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. మట్టిలో కూరుకుపోయిన పెట్రోల్ ట్యాంకర్‌ను జేసీబీ సాయంతో బయటకు తీయించారు. కొండపల్లి నుంచి పొదిలి వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఇరు వర్గాల ఘర్షణ... ముగ్గురికి గాయాలు:పార్వతీపురం మన్యం జిల్లాలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కొమరాడ మండలం గుమడలో మద్యం మత్తులో ఇద్దరి మధ్య వివాదం తలెత్తి... పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి.
నూకల బస్తాలు మీద పడి వ్యక్తి మృతి: ఏలూరు జిల్లా నూజివీడు మండలం మొర్సపూడి గ్రామంలోని శ్రీనివాస ఫీడ్ ప్లాంట్లో నూకల బస్తాలు మీదపడి వ్యక్తి మృతి చెందాడు. మృతుడు నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన బొకినాల మోషే(55) అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఫీడ్ ప్లాంట్ వద్ద మృతదేహంతో ప్రజా సంఘాలు, గొల్లపల్లి గ్రామస్థులు నిరసనకు దిగారు. మృతుడి కుటుంబానికి రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే మోషే మృతిచెందినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
బైకు చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్: తాళాలు సరిగా వేయని బైకులే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పెదకాకాని పోలీసులు అరెస్టు చేశారు. అలా ఇప్పటి వరకూ గుంటూరు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇప్పటి వరకు 10 ద్విచక్ర వాహనాల్ని అపహరించినట్లు పోలీసు తెలిపారు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. దుగ్గిరాల మండలం పెనుమూలికి చెందిన ఏపూరి శ్రీనివాసరావు అనే వ్యక్తి గతంలో ఓ కొరియర్ సంస్థలో డెలివరీ బాయ్‌గా పనిచేసేవాడు. చెడు అలవాట్లకు బానిసై వాహనాల దొంగతనాలు ప్రారంభించాడు. వాటిని ఓఎల్ఎక్స్ ద్వారా విక్రయించి ఆ సొమ్ముతో జల్సాలు చేసేవాడు. వాహనానికి సంబంధించిన వివరాలను రవాణా శాఖ వెబ్ సైట్లు, యాప్‌ల ద్వారా సేకరించి నకిలీ ఆర్సీ తయారు చేసేవాడు. వాహనం ఛాసిస్ నంబర్ తెలియకుండా దానిపై గీతలు గీసేవాడు. దీంతో వాహనం కొనేవారికి అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడని పోలీసులు తెలిపారు. సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనేవారు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.
కుక్కల దాడిలో చుక్కల దుప్పి మృతి: ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలం దర్శిగుంటపేట గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో కుక్కలు దాడిలో చుక్కల దుప్పి మృతి చెందింది. గచ్చకాయల కుంటలో నీళ్లు తాగేందుకు వచ్చిన చుక్కల దుప్పి పై ఒక్కసారిగా కుక్కలు దాడి చేయడంతో దుప్పి అక్కడికక్కడే మృతి చెందింది. గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న అంబవరం అటవీ శాఖ అధికారులు చుక్కల దుప్పి మృతదేహానికి పంచనామా నిర్వహించారు. కుక్కలు దాడి చేయడం వల్లే దుప్పి మృతి చెందినట్లు దృవీకరించారు. అనంతరం దుప్పి కళేబరాన్ని పై అధికారుల ఆదేశాల మేరకు ఖననం చేసినట్లు తెలిపారు.
కుటుంబాల మధ్య ఘర్షణ... ఆరుగురికి గాయాలు: కర్నూలు జిల్లా కోసిగి మండలం చిర్థనకల్లు గ్రామంలో స్థలం విషయంలో అన్నదమ్ముల కుటుంబాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఔటపోస్టు పోలీసులు కేసు నమోదు చేసి... దర్యాప్తు చేపట్టారు.
గోదావరిలో స్నానానికి వెళ్లి... యువకుడు మృతి: కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం తొత్తరమూడీ పెదలంక వద్ద గోదావరిలో స్నానానికి దిగి తోకల వినయ్ అనే యువకుడు మృతి చెందాడు. వినయ్ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
నల్లగార్లపాడులో పేకాటరాయుళ్ల అరెస్ట్: ఎన్టీఆర్ జిల్లా రొంపిచర్ల మండలం నల్లగార్లపాడు గ్రామ శివారులోని పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.69,460 నగదును స్వాధీనం చేసుకుని.. కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
వ్యక్తి ఆత్మహత్య :బాపట్ల జిల్లా నిజాంపట్నం మండల కేంద్రంలో ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కరమ్ సింగ్ (36) కుటుంబంతో పది సంవత్సరాల క్రితం నిజాంపట్నం వచ్చాడు. ఇక్కడే పానీ పూరి వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మరి, ఏం జరిగిందో తెలియదు.. శుక్రవారం సాయంత్రం వ్యాపారం చేస్తూ మధ్యలోనే ఇంటికి వెళ్లిపోయాడు. అద్దెకు ఉంటున్న ఇంటిలోనే ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆలస్యంగా గమనించిన భార్య, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అనారోగ్య సమస్యల కారణంగానే బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు.
ఇదీ చదవండి: పోలీసుల అత్యుత్సాహం...వైద్యం అందక చిన్నారి మృతి!