కర్నూలు జిల్లా :జల్సాలకు అలవాటుపడి చోరీలకు పాల్పడుతున్న దంపతులను కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని థానే జిల్లా బెల్వాలి వాసులు వినోద్ శామ్రావ్ సాలోంకే, అతని భార్య షామల దీపక్ భార్యాభర్తలు. వీరు ఈనెల 16న నగరంలోని చందన బ్రదర్స్ లో బంగారాన్ని కొంటున్నట్లు నటించి 35గ్రాముల గొలుసును దొంగిలించి ఎంచక్కా కారులో చెక్కేశారు. వీరి చేతివాటమంతా సీసీ కెమెరాల్లో నమోదయ్యింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని గుర్తించి అరెస్టు చేశారు. బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు.
అన్నమయ్య జిల్లా : కార్లను చోరీ చేసే నలుగురు దొంగలను మదనపల్లె పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఏఆర్ లింగంపల్లికి చెందిన మెహమ్మద్ అయాజ్,జమా ప్రసాద్, రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా రాయచోటి చెందిన నందలూరు రాజా నర్మదా రెడ్డి, పగిడిపల్లి శుభాన్ లు ముఠాగా ఏర్పడి కార్లను అద్దెకు తీసుకుని వాటిని బయట ప్రాంతాల్లో కుదువపెట్టి డబ్బులు తీసుకునేవారు. నకిలీ తాళం చెవిని వినియోగించి కుదువపెట్టిన కార్లను దొంగిలించి వాటిని కుదువ పెట్టడం..వచ్చిన డబ్బుతో జల్సా చేయడం వీరి పని.కార్ల యజమానులకు అనుమానం రాకుండా జిపిఎస్ దారి మళ్లించేవారు. ఇలాగే..మదనపల్లెలో దొంగతనానికి ప్రయత్నిస్తూ రిక్కీ నిర్వహిస్తుండగా అనుమానించిన పోలీసులకు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. నిందితుల నుంచి 9కార్లను స్వాధీనం చేసుకున్నారు. వీరి నలుగురిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరిచినట్లు డిఎస్పీ తెలిపారు.
పల్నాడు జిల్లా : నరసరావుపేట మండలం ఇసప్పాలెంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ వృద్ధ దంపతులను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు గుడి ఎదుట విడిచి వెళ్లారు.చిలకలూరిపేటకు చెందిన బద్దురి వెంకట సుబ్బారెడ్డి(74), సీతారావమ్మ (70) దంపతులుగా తెలిపారు. చిలకలూరిపేటలో ఇటీవల తమ ఇంటిని కొడుకు పేరిరెడ్డి 30 లక్షలకు అమ్మేశాడని చెప్పారు.వారికి స్థానికులు ఆశ్రయం ఇచ్చి ఆహారం అందించారు.
నెల్లూరు జిల్లా : ఆత్మకూరు మండలం గొల్లపల్లి వద్ద రాత్రి వరిగడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ను ద్విచక్ర వాహనం ఢీకొంది. బైక్ నడుపుతున్న యువకుడు మురళికి తీవ్ర గాయాలుకాగా.. ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి మురళి చెందాడు. యువకుడి సొంతూరు కరటం పాడు సమీపంలోని సాతాను పల్లి గ్రామంగా గుర్తించారు. వచ్చేనెల 15న మురళికి వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి పనులు ముగించుకుని తిరిగి సొంతూరుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా:లావేరు మండలం బొంతుపేట గ్రామంలో రెండు ఆవులు దాణ తిన్న అర గంటలోనే మృత్యువాత పడ్డాయి. వెంకటరమణ అనే రైతు... శ్రీకాకుళంలోని ఓ పశువుల దాణ దుకాణంలో 'కామధేను మిలీనియం సూపర్' పశువుల దాణను కొనుగోలు చేశాడు. పశువులకు ఆహారంగా ఆ దాణ ఇవ్వగా.. అది తిన్న అర గంటలోనే రెండు ఆవులు మృతి చెందాయి. మరో ఆవు తీవ్ర అస్వస్థతకు గురైంది. సమాచారం అందుకున్న పశువైద్యుడు ఘటనాస్థలానికి చేరుకుని చికిత్స అందించినప్పటికి ప్రయోజనం లేకుండా పోయింది. పశువులు మృత్యువాతపై పశువైద్యాధికారి లావణ్యను వద్ద ప్రస్తావించగా.. ప్రాథమిక విచారణ జరుగుతోందని పేర్కొన్నారు. మృతిచెందిన ఆవులు వైఎస్సార్ పశు క్రాంతి నష్టపరిహార పథకం కింద నమోదైనట్లు తెలిపారు.
వైఎస్ఆర్ జిల్లా: కడపలోని శ్రీనివాస ఆస్పత్రిలో ఆపరేషన్ చేస్తుండగా వ్యక్తి మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆస్పత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. వేముల మండలం కొత్తపల్లికి చెందిన గంగులయ్య అనే వ్యక్తి బైపాస్ సర్జరీ కోసం పది రోజుల క్రితం కడపలోని శ్రీనివాస ఆస్పత్రిలో చేరారు. శుక్రవారం సాయంత్రం శస్త్ర చికిత్స చేస్తుండగా.. మృతి చెందాడు. కానీ వైద్యులు సాయంత్రం ఏడు గంటలకు ఆ సమాచారం అందించారని బంధువులు తెలిపారు. శస్త్రచికిత్స చేసే సమయంలో ఆసుపత్రిలో ఆక్సిజన్ లేకపోవడంతోనే గంగులయ్య మరణించాడని చెందాడని బంధువులు ఆరోపించారు. కేవలం వైద్యుల నిర్లక్ష్యం కారణమని బంధువులు నిరసన వ్యక్తం చేశారు
ప్రకాశం జిల్లా: కనిగిరి మండలం నందన మారెళ్ల గ్రామం వద్ద ప్రధాన రహదారిపై ట్రాక్టర్ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందాడు. తెల్లవారుజామున సవక కర్రల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను కడప నుంచి కనిగిరి మీదుగా విజయవాడకు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందాడు. మృతుడు ఉలవపాడు మండలం ఆత్మకూరు గ్రామానికి చెందిన కోటేశ్వరరావుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఏలూరు జిల్లా:అధికార పార్టీకి చెందిన మహిళా సర్పంచ్, ఆమె భర్త మానసిక వేధింపులు తాళలేక ఓ ఆశ కార్యకర్త ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని పెదపాడు మండలం కొత్తూరులో శివ పార్వతి అనే మహిళ ఆశా కార్యకర్తగా పని చేస్తోంది. గ్రామంలో ముగ్గురు ఏఎన్ఎంలు ఉండగా అందులో ఒక ఏఎన్ఎం వయసు రీత్యా ఉద్యోగం మానేశారు. అప్పటి నుంచి శివ పార్వతి ఆమె విధులు కూడా నిర్వహిస్తోంది. అయితే ఇటీవల ఆమెకు ప్రమాదం జరగడంతో నడుం నొప్పి కారణంగా తాను అదనపు విధులు నిర్వహించలేనని, ఆ విధులను మిగిలిన ఉద్యోగులకు పంచాలని కోరారు. ఈ మేరకు ఆసుపత్రి వైద్యులు ఇద్దరూ ఏఎన్ఎంలకు సమానంగా విధులను కేటాయించారు. గ్రామ సర్పంచ్ కడిమి పద్మావతి భర్త గోవిందరావు తమ బంధువులకు ఉద్యోగం ఇప్పించుకునేందుకు సబ్ సెంటర్కు వెళ్లి తనను దుర్భాషలాడుతూ అవమానిస్తున్నారని శివపార్వతి ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పినా పట్టించుకోకపోవడంతో గుర్తు తెలియని ట్లాబ్లెట్లను వేసుకుని ఆత్మహత్యకు యత్నించింది.
అనకాపల్లి జిల్లా:నర్సీపట్నం పోలీసు సబ్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో నాటుసారా తయారీ స్థావరాలపై నర్సీపట్నం ఏఎస్పీ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. సుమారు 2 వేల లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు.