Today AP Crime News: కృష్ణా జిల్లాలో బైకు చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మరదలిని ప్రేమిస్తున్నాడని... యువకుడి దారుణ హత్య: మరదలిని ప్రేమిస్తున్నాడని యువకుడిని దారుణంగా హతమార్చిన ఇద్దరు యువకులు. చిత్తూరు జిల్లా కేవీపురం మండలం వడ్డేపల్లికి చెందిన దొరస్వామి కుమారుడు కుమార్(21) కార్పెంటర్ పని చేసుకుంటూ చంద్రగిరి సమీపంలో ఉంటున్నాడు. వడ్డేపల్లికి చెందిన ఇంటర్ చదువుతున్న అమ్మాయిని ప్రేమించాడు. ఈమె వడ్డేపల్లికి చెందిన నాగేంద్ర అనే వ్యక్తికి మరదలి వరుస కావడంతో పెళ్లి చేసుకోవాలని భావించాడు. మరదలిని కుమార్ ప్రేమిస్తున్నాడని తెలుసుకున్నాడు. ఎలాగైనా కుమార్ ను హత్య చేయాలని నాగేంద్ర పథకం వేశాడు. ఈ నెల 25న స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్లిన రెడ్డికుమార్ ను తిరుపతి బస్టాండ్ వద్దకు పిలిచారు. వెంకటగిరికి చెందిన ప్రతాప్ తో కలిసి సమీపంలోని బార్ కి వెళ్లి మద్యం కొనుగోలు చేశారు. మార్గమధ్యలో పెట్రోల్ బంక్ లో లీటర్ పెట్రోల్ తీసుకున్నారు. ముగ్గురు ద్విచక్రవాహనంపై కరకంబాడి చెరువు వద్దకు వెళ్లి మద్యం తాగారు. ఆ తర్వాత వెంకటగిరికి బయల్దేరి ఏర్పేడు వద్ద బహిర్భూమికి వెళ్దామని వ్యాస ఆశ్రమం పక్కన అటవీ ప్రాంతానికి కుమార్ ను తీసుకెళ్లి నాగేంద్ర, ప్రతాప్ ముందే తెచ్చుకున్న నైలాన్ తాడుతో గొంతు బిగించి హత్య చేశారు. ఎలాంటి ఆధారాలు దొరకుండా పెట్రోల్ పోసి నిప్పంటించారు. అనంతరం వెంకటగిరికి వెళ్లిపోయారు. కుమార్ కనిపించడం లేదని బంధువులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్టు చేశారు. ఈ మేరకు మీడియాకు డీఎస్పీ మురళి కృష్ణ వివరించారు.
వ్యక్తి తల నరికిన దుండగులు:పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలంలో దారుణం జరిగింది. రెడ్డి గణపవరం పంచాయతీ జగ్గీచెట్టుగూడెం గ్రామంలో ఒక వ్యక్తి తల నరికిన ఘటన బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పొలంలో మేకల మందకు కాపలాగా ఉన్న వనమూల పర్వతాలు (60) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో తల నరికి మొండాన్ని వదిలి తలను తీసుకెళ్లారు. తెల్లవారు జామున పొలం పనులకు వెళ్లేవారు మంచం దగ్గర రక్తం గమనించి స్థానికులకు సమాచారం అందించారు. మృతుని బంధువులు ఘటనా స్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న బుట్టాయిగూడెం పోలీసులు కేసు నమోదు చేసుకొని, తల కోసం గాలిస్తున్నారు. హత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. డాగ్ స్వాడ్ ను సైతం రంగంలోకి దింపారు.
అనుమానాస్పద స్థితిలో ఇద్దరు మృతి: విశాఖ జిల్లా కశింకోట మండలం గోకివానిపాలెం వద్ద రహదారి పక్కన యువతి, యువకుడు మృతి చెందారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రేమజంటగా అనుమానిస్తున్నారు. మృతులు బుచ్చయ్యపేటకు చెందిన మజ్జి శ్రీను(25), కోటపాడు మండలం చౌడువాడ గ్రామానికి చెందిన చర్లపల్లి హేమలత(25)గా పోలీసులు గుర్తించారు.
బైకు చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్:కృష్ణాజిల్లా మచిలీపట్నంలో చెడు అలవాట్లకు బానిసై బైకుల చోరీలకు పాల్పడుతున్న పెడనకు చెందిన మణికంఠ, మరో మైనర్ బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.7.16 లక్షల విలువైన 14 బైకులు, హెల్మెట్లతో పాటు ఒక గేదెను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మీడియాకు మచిలీపట్నం డీఎస్పీ షేక్ మాసుమ్ బాషా వివరించారు.
అవుటపల్లిలో అగ్నిప్రమాదం:కృష్ణాజిల్లా గన్నవరం మండలం చిన్నఅవుటపల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. విద్యుదాఘాతంతో స్థానిక కోటేశ్వరరావు అనే వ్యక్తి ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బంది సాయంతో మంటలార్పారు. ఈ ఘటనలో ఇంట్లో సామగ్రి, నగదు దగ్ధమయ్యాయి.
ఏసీబీ వలలో మేళ్లవాగు వీఆర్వో:గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం మేళ్లవాగు వీఆర్వో పాసు పుస్తకాలు విషయంలో లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. 35 ఎకరాల పొలానికి పాసుపుస్తకాల మంజూరు నిమిత్తం మేళ్లవాగుకు చెందిన నాగభూషణం అనే వ్యక్తి వద్ద వీఆర్వో రూ.3.5 లక్షలు డిమాండ్ చేసి... లక్ష రూపాయలు తీసుకుంటూ పట్టుబడ్డాడని ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంలో బొల్లాపల్లి తహశీల్దార్, కంప్యూటర్ ఆపరేటర్ ప్రమేయం ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. తహశీల్దార్, కంప్యూటర్ ఆపరేటర్లను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.