తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేటలో ఇటీవల కాల్పులు జరిపి.. దోపిడికి యత్నించిన కేసును ఛేదించిన పోలీసులు.. నలుగురు నిందితులను అరెస్టు చేశారు.
జల్సాల కోసం దోపిడీలు..
Siddipet Robbery Case Updates : సిద్దిపేట సబ్‌రిజిష్ట్రార్ కార్యాలయం వద్ద డిసెంబర్ 31న తుపాకీతో కాల్పులు జరిపి.. డబ్బు అపహరించుకెళ్లిన ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో నివాసముంటున్నట్లు గుర్తించారు. సిద్దిపేట జిల్లా కొండపాకకు చెందిన గజ్జె రాజు.. కీసరలో నివాసముంటున్నాడు. రాజు, తన సమీప బంధువైన ఎడమ సాయికుమార్ ఇద్దరూ గతంలో ఓ యువతి కేసులో జైలుకెళ్లారు. గత సెప్టెంబర్‌లో బెయిల్‌పై వచ్చిన వీరు.. చేసిన అప్పులతో పాటు జల్సాల కోసం ధనార్జనే లక్ష్యంగా పెట్టుకున్నారు. భూముల రిజిస్ట్రేషన్ విలువల పెంపు డిసెంబర్ 31 చివరి రోజు కావటంతో అదే రోజు.. భూరిజిస్ట్రేషన్‌లు జరుగుతాయని భావించి అక్కడ దోపిడి చేసేందుకు పథకం పన్నారు. ఇందుకోసం సిద్దిపేట సబ్‌రిజిష్ట్రార్ కార్యాలయ ప్రాంతాన్ని అనువైన ప్రాంతంగా ఎంపిక చేసుకున్నారు.
రూ.43 లక్షలు దోపిడీ..
Siddipet Robbery Case News : అప్పటికే దొంగతనం చేసిన ఓ ద్విచక్రవాహనంపై.. కార్యాలయం వద్దకు వెళ్లిన రాజు, సాయి కుమార్.... అక్కడ ప్లాట్ విక్రయించిన డబ్బులతో వచ్చిన స్థిరాస్తి వ్యాపారిపై కన్నేశారు. డబ్బు సంచిని డ్రైవర్‌కు ఇచ్చిన వ్యాపారి తిరిగి కార్యాలయంలోకి వెళ్లడాన్ని అదునుగా చూశారు. ద్విచక్రవాహనంపై ఇద్దరు కారు వద్దకు వెళ్లి.. డ్రైవర్‌ను బెదిరించారు. అతడు పట్టించుకోకుండా వాహనాన్ని ముందుకు తీయటంతో.. డ్రైవర్‌పై తుపాకీతో కాల్పులు జరిపి.. కారులో 43న్నర లక్షల నగదును అపహరించుకెళ్లారు.
15 బృందాలతో గాలింపు..
ఈ కేసు విచారణ కోసం రంగంలోకి దిగిన 15 పోలీస్ బృందాలు.. పాతనేరస్తుల జాబితా, సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. దోపిడికి వచ్చిన వారిలో ఒకరైన సాయికుమార్‌ను గుర్తించిన పోలీసులు.. పూర్తిస్థాయి విచారణ జరపగా నిందితులు బయటికి వచ్చారు. ప్రధాన నిందితుడు గజ్జె రాజుతో పాటు సాయికుమార్... వీరికి సహకరించిన బలింపురం కరుణాకర్, బిగుళ్ల వంశీకృష్ణను అరెస్టు చేసినట్లు సిద్దిపేట సీపీ తెలిపారు.