రూపాయి రూపాయి నువ్వేమి చేస్తావంటే.. నన్ను సరిగా వినియోగించుకోకపోతే.. పచ్చని కాపురంలో నిప్పులు పోస్తా.. ఎలాంటి బంధాన్నైనా కూలదోస్తా అందట. అలాంటి మాటలకు అతికినట్టుగా సరిపోతుంది ఈ ఘటన. మూడు ముళ్లు వేసిన భర్త ఊపిరి తీసింది ఓ భార్య.. ఏడడుగులు నడిచిన వ్యక్తిని ఆరడుగుల గోతిలో పాతేసింది.. ఇదంతా కేవలం ఆస్తి అమ్మగా వచ్చిన డబ్బు కోసమే. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రం మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండలం దర్పల్లిలో జరిగింది.
రెండు నెలల క్రితమే..
దర్పల్లి గ్రామ పంచాయతీ చిన్నంబావికి చెందిన చిన్నయ్య(45) రెండు నెలల క్రితం నుంచి కనిపించకుండాపోయాడు. భార్యతో సహా కుటుంబ సభ్యులు తెలిసిన చోటల్లా గాలించారు. ఇంకా వెతుకుతూనే ఉన్నారు. ఈ క్రమంలో చిన్నయ్య భార్యపై కుటుంబ సభ్యులకు అనుమానమొచ్చింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
ఇంటి ఆవరణలోనే పాతిపెట్టింది
తన భర్త చిన్నయ్యను తానే హత్య చేశానని రాములమ్మ అంగీకరించింది. మృతదేహాన్ని ఇంటి వద్ద నిర్మించిన మరుగుదొడ్డి కింద పాతిపెట్టానని చెప్పింది. ఇవాళ జేసీబీ సాయంతో ఇంట్లో నిర్మాణాలు తొలగించి చూడగా.. కుళ్లిన స్థితిలో ఉన్న చిన్నయ్య మృతదేహం లభించింది.