అదనపు కట్నం కావాలనే అత్తింటి వేధింపులు భరించలేక ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన తెలంగాణ సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఠాణా పరిధిలో జరిగింది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం బీరంగూడ మంజీరానగర్ కాలనీకి చెందిన శివయ్య కూతురు సరితకు పటాన్‌చెరు మండలం లక్డారం గ్రామానికి చెందిన రాఘవేందర్ అనే వ్యక్తితో గతేడాది ఆగస్టు 13న వివాహమైంది.
ఓ వైపు కట్నం.. మరోవైపు అందంగా లేవని...
పెళ్లి సమయంలో రాఘవేందర్‌కు 5 తులాల బంగారు ఆభరణాలు, ద్విచక్రవాహనం, సామాగ్రి కానుకలుగా ఇచ్చామని ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. అయినా అదనపు కట్నం కావాలని... అందంగా లేవని భర్త రాఘవేందర్, అత్త లక్ష్మి, ఆడపడుచు రజితలు వేధించేవారని ఆరోపించారు. భర్త కుటుంబసభ్యులు సరితను చాలాసార్లు శారీరకంగా హింసించేవారని వాపోయారు. దీనిపై సరిత తల్లిదండ్రులు నచ్చజెప్పినా వారి ప్రవర్తన మార్చుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.