ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దారుణహత్య - సంగారెడ్డిలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దారుణహత్య

MURDER: సంగారెడ్డి జిల్లా జిన్నారంలో దారుణం జరిగింది. కేపీహెచ్‌బీ పరిధిలో అదృశ్యమైన యువకుడు దారణహత్యకు గురయ్యాడు. ప్రేమపెళ్లి చేసుకున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి నారాయణరెడ్డిని యువతి తరఫు బంధువులు చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నారాయణరెడ్డిని హత్య చేసి నిప్పుపెట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు.

MURDER
MURDER

By

Published : Jul 3, 2022, 12:34 PM IST

MURDER: తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జిన్నారంలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ నారాయణరెడ్డి (25)ని హతమార్చారు. హత్య అనంతరం జిన్నారం అటవీ ప్రాంతంలో యువకుడి మృతదేహాన్ని తగులబెట్టినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీ రోడ్డు నంబర్‌ 1లో నారాయణరెడ్డి తన స్నేహితుడితో కలిసి నివసిస్తున్నారు. ఏడాది క్రితం ఓ యువతిని నారాయణరెడ్డి ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఆ పెళ్లి ఇష్టం లేని యువతి తల్లిదండ్రులు ఆమెను బలవంతంగా తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత కూడా యువతి, నారాయణరెడ్డి ఫోన్‌లో మాట్లాడుకుంటున్నట్లు గుర్తించిన తల్లిదండ్రులు, బంధువులు.. అతడిని హతమార్చాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో గత కొద్దిరోజులుగా నారాయణరెడ్డి కనిపించకపోవడంతో జూన్‌ 30న కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు నమోదైంది.

ఈ క్రమంలో విచారణ చేపట్టిన పోలీసులు.. మృతుడి కాల్‌డేటా ఆధారంగా శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. శ్రీనివాస్‌రెడ్డితో నారాయణరెడ్డికి ముందే పరిచయం ఉండటంతో జూన్‌ 29న వాళ్లిద్దరితో పాటు మరికొంతమంది ఖాజాగూడ వద్ద ఓ వైన్‌షాపులో మద్యం కొనుగోలు చేసి ఓ చోట సేవించారు. అనంతరం నారాయణరెడ్డిని గొంతు నులిమి హతమార్చి జిన్నారం అటవీ ప్రాంతంలో పెట్రోల్‌ పోసి తగులబెట్టారు.

శ్రీనివాస్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా ఈ విషయాలు బయటకు వచ్చాయి. నిందితుడు చెప్పిన వివరాల మేరకు ఘటనాస్థలానికి పోలీసులు వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. యువతి కుటుంబసభ్యులే నారాయణరెడ్డిని హత్య చేయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసుపై పోలీసులు అధికారికంగా వివరాలు వెల్లడించాల్సి ఉంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details