FARMER SUICIDE : భూమాతను నమ్ముకొని రెక్కలు ముక్కలు చేసి బతుకుతున్న రైతులకు అప్పులు మనోవేదనను మిగులుస్తున్నాయి. పంట చేతికి రాక.. ఒకవేళ వచ్చినా గిట్టు బాటు ధర లేక ఎందరో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈసారన్నా మంచి దిగుబడి వచ్చిద్ది అనుకున్న సమయానికి కాలం కన్నెర్ర చేసి ప్రకృతి రూపంలో ఆటంకాలు సృష్టించి నిలువునా ముంచితే.. ఆ అన్నదాత వేదనను తీర్చేవారు ఎవరూ. ప్రతి సంవత్సరానికి పెరుగుతున్న అప్పులు ఆ రైతన్నను కుదురుగా ఉండనివ్వకపోతే.. ఆ కర్షకుడిని ఆదుకునే నాథుడు ఎవ్వడు.
రైతుల సంక్షేమానికే తమ పెద్దపీట అని ఊదరగొట్టే ప్రభుత్వాలు వారిని కష్టకాలంలో ఎందుకు ఆదుకోవడం లేదు. మాటలతో కాలక్షేపం చేసే ప్రభుత్వాలు ఉన్నంతకాలం.. రైతుల బలవన్మరణాలకు అడ్డుకట్ట పడదు. చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఓ రైతు ప్రాణాలు తీసుకున్న ఘటన తాజాగా గుంటూరు జిల్లాలో జరిగింది. ఫిరంగిపురం మండలం తక్కెళ్లపాడుకు రాజవరపు శ్రీనివాసరావు అనే రైతు.. గురువారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు.